Warangal BRS Meeting: వరంగల్: తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య బీఆర్ఎస్ ను వీడిన తరువాత కారులో కొత్త జోష్ వచ్చిందని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. హన్మకొండలో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్​విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన హరీష్ రావు కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్​ఇచ్చినా, బీఆర్ఎస్ పార్టీకి ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని గతంలో లంకె బిందెల దొంగతో పోల్చిన కడియం శ్రీహరి ఇప్పుడు అదే రేవంత్‌ చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారని విమర్శించారు. ఇంతగా దిగజారడం అవసరమా అని కడియంను ప్రశ్నించారు. 




టీడీపీ నుంచి కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ మంత్రి పదవి ఇచ్చింది తానేనంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీ రామారావు కడియంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా.. తాను బతిమిలాడి టికెట్ ఇప్పించానన్నారు. ఆపై క్యాస్ట్ ప్రాతిపదికన తనకు మంత్రి పదవి రాకపోతే.. కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇప్పించానని దయాకర్ రావు పేర్కొన్నారు. కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని తాను ముందే చెప్పానన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారే పరిస్థితి ఉందని హరీష్ రావు తనతో అన్నారని ఈ సందర్భంగా దయాకర్ రావు గుర్తు చేశారు.