Hanmakonda News: మరో వారం రోజుల్లో ఉన్నత విద్య కోస విదేశాలకు వెళ్లేవారు. కానీ అంతలోనే ఓ ఆర్ఎంపీ ఇచ్చిన సూది వల్ల ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన సూదిమందు వికటించి విద్యార్థి మృతి చెందారు.
హన్మకొండ జిల్లా ఎల్కుతుర్తి మండలం జగన్నాథపురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బడి రవీందర్ కు ఇద్దరు కుమారులు. ముల్కనూర్ లోని సహకార సంఘంలో పని చేసే ఆయన కుమారులను ఉన్నత చదువులు చదివించాలని ఆశలు పెట్టుకున్నారు. పెద్ద కుమారుడు విజయ్ కు 22 సంవత్సరాలు. ఈయన ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. ఎంబీఏ చదవడానికి కెనడా వెళ్లాలనుకున్నారు. ఈనెల 22వ తేదీన వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దురదృశ్టవశాత్తు శనివారం రోజు విజయ్ కు జ్వరం వచ్చింది.
విజయ్ తల్లిదండ్రులు జీల్గుల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. వైద్యుడు శ్రీనివాస్ మాత్రలు ఇచ్చి పంపించాడు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మరోసారి వైద్యుడి వద్దకు వెళ్లగా సూది మందు వేశాడు. అయితే సూదిన వేసిన ప్రాంతంలో నొప్పి ఎక్కువ కావడంతో మళ్లీ అదే వైద్యుడి వద్దకు వెళ్లారు. అయితే వెంటనే ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్.. విజయ్ ను హుజూరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడి వైద్యులు పరిశీలించి ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా అప్పటికే విజయ్ మృతి చెందారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా బతకాలనుకున్న తమ కుమారుడు అచేతన స్థితిలో పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎస్సై అభ్యర్థి మృతి..
గవర్నమెంట్ జాబ్, అందులోనూ ప్రజలకు నిత్యం సేవలు అందించే పోలీస్ శాఖలో కొలువు సాధించాలని కలలు కన్నాడు. అందుకోసం ఆ యువకుడు నిరంతరం శ్రమించాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కొట్టి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. కానీ విధి వక్రించింది. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
సమర్తపు లక్ష్మయ్య తన కుటుంబంతో సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ పోలీస్ కావాలని, సబ్ ఇన్‌స్పెక్టర్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కొన్ని నెలల కిందట నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ప్రిలిమినరీ పాసైన వారికి శారీరక, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇది పాసైన వారికి ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం డిగ్రీ కాలేజీకి వచ్చిన శ్రీకాంత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు శ్రీకాంత్ పరిస్థితి గమనించి ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లుగా తెలిపారు. కొన్ని నెలల్లో కుమారుడు పోలీస్ అవుతాడని, ప్రయోజకుడు అయ్యి తమ పేరు నిలబెడతాడని భావించిన తల్లిదండ్రులు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అవుతాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో లక్ష్మయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.