Gadwal News: రోజురోజుకూ మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. అన్నా చెల్లెల్లు రోడ్డు మీద వెళ్తున్నా అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. భర్తకు భార్యపై, భార్యకు భర్తపై అనుమానాలు పెంచుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఙటనే జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. సమీప బంధవుతో దిగిన ఫొటోల కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అదేంటి ఫొటోల వల్ల ప్రాణాలు ఎలా పోయాయి అనుకుంటున్నారా.. ఓ అమ్మాయి సమీప బంధువుతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు చూసిన ఆ అబ్బాయి స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. దీంతో అవమానం భరించలేని అమ్మాయి.. ఆత్మహత్యకు పాల్పడింది.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన 20 ఏళ్ల మేఘలత జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన 24 ఏళ్ల శివ కుమార్ ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో మేఘలతకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈనెల 6వ తేదీన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మేఘలత మానసిక క్షోభకు గురైన ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతే కాకుండా చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ కూడా రాసిది.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..?
"నాన్నా.. నేను నీ కూతురిని. ప్రాణం పోయినా తప్పు చేయను. 2019లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన వారిని వదలకు. అమ్మను, చెల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో." అంటూ తండ్రికి లేఖ రాసింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య..
నిజామాబాద్‌లోని వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పదిహేడేళ్ల అక్షిత సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
అక్షిత సూసైడ్ విషయం గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని కాలేజీ సిబ్బందికి చెప్పారు. వెంటనే ఈ స్పందించిన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అక్షిత మృతి చెందింది. అక్షిత పాలిటెక్నిక్ ఈసీఈ విద్యార్థిని. ఇటీవలే మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆమె ఒక సబ్జెక్ట్‌లో తప్పింది.
మొదటి సెమిస్టర్‌లోనే ఒక సబ్జెక్ట్ తప్పిన అక్షితకు పరీక్షలంటేనే భయం పట్టుకుంది. తరచూ తోటి స్నేహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించేది. రేపటి(మంగళవారం) నుంచి రెండో సమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో సూసైడ్ చేసుకుంది. అయితే అక్షిత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని... పరీక్షలు అంటే ఎప్పుడూ భయపడేది కాదని అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.