హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం (మార్చి 29) యూనివర్సిటీలో నేడు జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా పడడం ఇందుకు కారణం అయింది. ఆ సభ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనకు దిగారు. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. దాంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా ధర్నా చేశారు. యూనివర్సిటీ అధికారులు కూడా సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగిన వారు.. కొంతమంది గేటు వద్ద టైర్లకు నిప్పు అంటించేందుకు ప్రయత్నించారు. ఇంకొంత మంది పూల కుండీలను పగలగొట్టారు.
ఈ నిరసనకు భారీగా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు మరింత మంది వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.