మేడారంలో శనివారం (ఫిబ్రవరి ) గవర్నర్ తమిళిసై పర్యటన సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై దుమారం రేగుతోంది. సమ్మక్క సారలమ్మ దర్శనానికి గవర్నర్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కానీ, మరెవరూ హాజరు కాలేదు. కనీసం గవర్నర్‌కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ కూడా అక్కడికి రాలేదు. గవర్నర్ పర్యటనకు ముందే మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాధారణంగా గిరిజన ప్రాంత అభివృద్దిపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అయినా కలెక్టర్‌ గానీ, ఎస్పీ పట్టించుకోలేదు. దీనిపైనే ఇప్పుడు విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.


దీనిపై నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రానికి తొలి పౌరురాలు అయిన గవర్నర్‌కు ఇంత అవమానమా? అంటూ ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా అవమానిస్తారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది ప్రజలు సందర్శించే మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను సీఎం కేసీఆర్ అవమానించారని బండి సంజయ్ మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


దీనిపై నేడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా స్పందించారు. ఆ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారానికి వచ్చినప్పుడు గవర్నర్‌ను అవమానించారని అన్నారు. ఒక సంస్కార హీనమైన సంప్రదాయానికి కేసీఆర్ తెర తీశారని ఆరోపణలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. ఆయన సంస్కారం ఏంటో ఈ ఘటనతో అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ పుట్టి‌నరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యమని కేసీఆర్‌కు గుర్తుచేస్తున్నాని తెలిపారు. 


బీజేపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతాయన్న కేటీఆర్‌వి చిల్లర వ్యాఖ్యలు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్నదాని ప్రకారం.. జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగం గురించి మాట్లాడుతూ.. నోటిఫికేషన్లు లేకపోవడంతో తెలంగాణ యువకులకు పెళ్లిళ్లు కావటం లేదని అన్నారు. ఉద్యోగ నియామకాలపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.