Godavari Water Level: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురవడంతో వరదలు పెరిగాయి. దీని వల్ల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అయితే భారీ వరదల వల్ల నీటిమ్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో సీతారమస్వామి ఆలయ పరిసరాల్లోకి కూడా వర్షం నీరు చేరింది. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్నదాన సత్రం వద్ద భారీగా నీరు నిలిచింది. దీంతో అన్నదాన కార్యక్రమాన్ని ఆపేశారు. నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రియాంక వరద పరిస్థితిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు.


24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూంల ఏర్పాటు


24 గంటల పాటు జిల్లా అధికారులంతా పని చేసేలా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం, ఆర్టీఓ కార్యాలయాలు, చర్ల, దమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరుపినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. గోదావరిలో వరద పోటెత్తుతున్న క్రమంలో ఎవరి ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు. అదే 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు.