భద్రాచలం: ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాంతం నుంచి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. రెండు రోజుల కింద 30 అడుగులుగా ఉన్న నీటిమట్టం, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి 50 అడుగులకు చేరుకుంది. శనివారం ఉదయానికి వరద నీటిమట్టం మరింత పెరిగి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితులు తీవ్రంగా మారడంతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్‌లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని, వాగులు, వంకలు దాటకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్తంభించిన రాకపోకలు.. నీటమునిగిన పర్ణశాల
గోదావరి వరద ఉధృతి పెరగడంతో శుక్రవారం సాయంత్రం నుంచే దుమ్ముగూడెం- భద్రాచలం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీటమునిగాయి. అలాగే సీతావాగు వద్ద ఉన్న సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జిలు వరద నీటిలో నిండిపోతున్నాయి. మరోవైపు, తూరుబాక ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై ఇటీవల కొత్తగా నిర్మించిన హైలెవల్ వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు తీవ్రంగా కోతకు గురై వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రెస్క్యూ టీమ్‌కు తప్పిన ప్రమాదంభారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చిన వరద నీరు పెరిగిపోతుండటంతో చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ 30కి పైగా లారీలు క్వారీలోనే ఉండిపోయాయి. క్వారీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్తున్న క్రమంలో సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డిలు ప్రయాణిస్తున్న తెప్ప మునిగిపోవడంతో వారు వరద నీటిలో పడిపోయారు. అదృష్టవశాత్తూ వారు ఈదుకుంటూ తిరిగి తెప్పపైకి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
ప్రాజెక్టుల పరిశీలనకు మంత్రుల బృందంగోదావరి వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో పరీవాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకరతో ఫోన్‌లో మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్యం, విద్యుత్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాగా, రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలించేందుకు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులతో పాటు పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ పంప్‌హౌస్‌ను నేడు సందర్శించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రాబోయే 5 రోజులు ఓ మోస్తరు వర్షాలుతీవ్ర వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ వైపు వెళ్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మీదుగా ద్రోణి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. గడిచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లా తపాల్‌పూర్‌లో అత్యధికంగా 16.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆదిలాబాద్, జగిత్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.
