Bhadrachalam Flood: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రవాహం గంట గంటకూ పెరుగుతూ వస్తోంది. నీటి మట్టం 48 అడుగులు దాటి 50 అడుగులు చేరుకుంటోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 


రెండో ప్రమాద హెచ్చరిక జారీ..


మంగళవారం సాయంత్రం 43.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం అర్ధరాత్రి ఒంటి గంటకు 48 అడుగులకు చేరింది. 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు... వరద ప్రవాహం 48 అడుగులకు చేరగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నీటితో నిండుకుండలా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. 7 గంటల సమయానికి వరద నీటి మట్టం 49.8 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. 


సురక్షిత ప్రాంతాలకు తరలింపు..


గోదావరి నది వరద ప్రవాహం మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి వరద మరోసారి పోటెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వారావు పేట, చర్ల, బూర్గం పాడు, ఏడూళ్ల బయ్యారం, పినపాక, సారపాక తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలను కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలింతే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. 


జూరాలకు భారీ వరద.. 
జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన నారాయణపూర్‌ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి లక్షా 61 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు జురాల ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తి లక్షా 46 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 317.750 మీటర్ల నీటి మట్టం ఉన్నది. జూరాల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా.. 8.126 టీఎంసీల నీరు నిల్వ ఉంది.


తుంగభద్రకు వరదే వరద..


తుంగభద్ర నదికి 1.58 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మంగళవారం హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలోని డ్యాం పైభాగంలో కురుస్తున్న వర్షాలకు హోస్పేట్‌ డ్యాంలో వరద నీటి ప్రవాహం పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారని తెలిపారు. ప్రస్తుతం రాఘవేంద్రస్వామి మఠం వెనుక ప్రవహిస్తున్న తుంగ భద్ర నది ఉద్ధృతంగా ఉంది. మంగళవారం విడుదల చేసిన నీరు బుధవారం ఉదయానికి చేరుకోవచ్చని సిడబ్ల్యుసి అధికారి షేక్షావలీ పేర్కొన్నారు. తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు సిబ్బందితో తుంగభద్ర నదీతీరంలో తగిన భద్రత కల్పించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.