Gadwal News: బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చారు. ఈక్రమంలోనే రెండు కుటుంబాలకు చెందిన 15 ఏళ్ల లోపు పిల్లలంతా కలిసి దగ్గర్లోనే కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. మొత్తం 11 మంది వెళ్లగా నలుగురు చిన్నారులు నదిలోకి దిగగానే గల్లంతయ్యారు. మిగతా పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పిల్లల కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. 


అసలేం జరిగిందంటే?


గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం బొరవెల్లి గ్రామంలో ఇమామ్ అనే వ్యక్తి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు కర్నూల్ కు చెందిన ఇబ్రహీం, ఇస్మాయిల్ కుటుంబాలు వచ్చాయి. రెండు కుటుంబాల్లోని మొత్తం 11 మంది బాలబాలికలు కాసేపు ఆడుకున్నారు. ఇంటి దగ్గర వారికి బోర్ కొట్టడంతో.. కాసేపు సరదాగా ఈతకు వెళ్దామని ప్లాన్ వేశారు. ఈక్రమంలోనే ఇటిక్యాల మండలం మంగంపేట గ్రామ శివారులో ఉన్న కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. నదిలోకి దిగిన చిన్నారుల్లో నలుగురు గల్లంతు అయ్యారు. మిగతా పిల్లలంతా కేకలు వేస్తూ రావడంతో.. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి వచ్చారు. ఓ వైపు ఏడుస్తూనే మరోవైపు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురు చిన్నారుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతుల్లో 19 ఏళ్ల ఆఫ్రిన్, 15 ఏళ్ల రిహాన్, ఎనిమిదేళ్ల సమీర్, ఏడేళ్ల నౌసిన్ ఉన్నారు. పిల్లల మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నలుగురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 



మెదక్ లో విషాదం


మెదక్‌ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు నుంచి కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన జంట.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి ప్రేమ జంట మృతదేహాలను వెలికితీశారు. 


అసలేం జరిగిందంటే..?


జిల్లాలోని నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరద్దరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల్లో తెలిసిపోయింది. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెళ్లి చేసుకునేందుకు మేము ఒప్పుకోమంటూ చెప్పారు. దీంతో జంట తీవ్ర మనస్తాపానికి గురైంది. కలిసి జీవించలేని తాము కనీసం చావుతోనైనా ఒకటవుదామని భావించారు. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం నాడే ఈ ప్రేమ జంట ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ కలసి నార్సింగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో.. ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకున్నారు. వెళ్లి చూసే సరికి కల్పన, ఖలీల్ చెరువులో మృతదేహాలై తేలారు. ఇదే విషయాన్ని పోలీసులు ఇరుకుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆపై మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరిలంచారు. చేతికి అంది వచ్చిన పిల్లలు.. ఇలా చలనం లేకుండా పడి ఉండడం చూసి ఇరుకుటుంబాల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.