Gadchiroli News: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల ప్రభావం తగ్గిందని భావిస్తున్న తరుణంలో, తాజాగా వెలుగుచూసిన కరపత్రాలు భద్రతా బలగాలను ఉలిక్కిపడేలా చేశాయి. ముఖ్యంగా ఎటపల్లి తాలూకాలో జరుగుతున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు గళం విప్పారు.ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దీంతో భద్రతా బలగాలు నిఘా పెంచాయి.
గడ్చిరోలిలో మైనింగ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు పోస్టర్లు
గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి తాలూకా పరిధిలో ఉన్న జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ కరపత్రాలను మావోయిస్టు నేత కామ్రేడ్ అశోక్ పేరుతో వెలిశాయి. ప్రధానంగా మైనింగ్ కంపెనీల తీరును తప్పుబడుతూ వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న మైనింగ్ ప్రాజెక్టులను గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజలు అడ్డుకోవాలని కోరారు.
గడ్చిరోలిలో మైనింగ్ ఆపాలని డిమాండ్
గడ్చిరోలి జిల్లా అటవీ సంపదతోపాటు ఖనిజ సంపద విస్తారంగా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఐరన్ ఓర్ ఉంది. దీంతో మైనింగ్ ప్రాజెక్టులను విస్తరించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది పర్యావరణానికి, గిరిజనులకు నష్టాన్ని కలిగిస్తుందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అందుకే మైనింగ్ ప్రాజెక్టులు పూర్తిగా నిలిపివేయాలి అనే నినాదంతో పోస్టర్లు వేశారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రతా బలగాలు హై అలర్ట్
ఈ కరపత్రాలు ఎటపల్లి తాలూకాలోని ప్రధాన సరిహద్దు గ్రామాల్లో కనిపించాయి. గడ్చిరోలి-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం మొన్నటి వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రభుత్వాలు ప్రకటించాయి. గడ్చిరోలిలో మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ లేఖలు విడుదల కావడం ఆందోళనకలిగిస్తున్నాయ. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి యత్నిస్తున్నారని ఈ పోస్టర్లు చూస్తుంటే అర్థమవుతోంది.
అనుమానితుల కదలికలపై నిఘా
మావోయిస్టుల కరపత్రాల వెలుగులోకి రావడంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. గడ్చిరోలి జిల్లాతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను మరింత కఠినతరం చేశారు. భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. అనుమానిత కదలికలపై నిఘా ఉంచారు.
టెన్షన్ పడుతున్న ప్రజలు
గడ్చిరోలి ప్రాంతంలో మైనింగ్ దశాబ్దాలుగా వివాదాస్పద అంశంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం మైనింగ్ ద్వారా ఉపాధి, అభివృద్ధి వస్తుందని చెబుతుంటే, మరోవైపు మావోయిస్టులు పర్యావరణ విధ్వంసం, గిరిజన నిర్వాసితుల అంశాన్ని ఎత్తిచూపుతున్నారు. మావోయస్టుల పార్టీ పూర్తిగా అంతరించిందని భావిస్తున్న ప్రజలకు ఈ పత్రాలు టెన్షన్ పెడుతున్నాయి.
