Vanaparti News: రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నాయి. ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులు కూడా మృత్యువాత చెందుతున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృత్యువాత చెందారు. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఇదే కారులో ప్రయాణం సాగిస్తున్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయ సహకారాలను అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.


నిద్ర మత్తు, అతివేగంతో ప్రమాదం


ఈ ప్రమాదానికి నిద్ర మత్తు, అతివేగమే కారణంగా తెలుస్తోంది. పోలీసులు కూడా ప్రాథమికంగా ఇదే నిర్ధారించారు. బళ్లారి నుంచి హైదరాబాదుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. కారును నడుపుతున్న వ్యక్తి అత్యంత వేగంగా నడపడంతోపాటు నిద్రమత్తు వల్ల చెట్టును ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో వాసి (1), బుష్రా (2), మరియా (4), ఫాతిమా (50), అబ్దుల్ రెహమాన్ (30) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో క్షతగాత్రులను, మృత్యదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి గురైన వ్యక్తిగా ఎర్టిగా కారులో 13 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఈ మార్గంలో ఉదయం 2.30 నుంచి ఐదు గంటల మధ్య అనేక ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే వనపర్తి ఆసుపత్రిలో చేర్చిన ఎనిమిది మందిలోనూ కొందరు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. మృతి చెందిన వారి స్వస్థలం ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు.