పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట ఈటల రాజేందర్ హాజరయ్యారు. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌లో కొద్ది రోజుల క్రితం 10వ తరగతి హిందీ పేపర్ లీక్ అయింది. పరీక్ష ప్రారంభమైన గంటసేపటికే ప్రశాంత్ అనే వ్యక్తి ఈటల రాజేందర్‌కు వాట్సప్‌లో పేపర్ పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా వాట్సప్ లో వెళ్లినట్లుగా గుర్తించారు. దీంతో ఈ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దూకుడు పెంచి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ కోసం ఈటల రాజేందర్‌కు కొద్దిరోజుల క్రితం నోటీసులు జారీ చేశారు.  ఆ ప్రకారమే ఈటల నేడు వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ డీసీపీతో పాటు ఏసీపీ, కమలాపూర్ ఇన్స్పెక్టర్లు కలిసి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. 


ఇప్పటికే ఈ కేసులో ఈటల రాజేందర్ పీఏలను పోలీసులు విచారించి వారి సెల్‌ఫోన్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. పేపర్ లీక్ కేసులో డీసీపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ ను పోలీసులకి ఇచ్చి, వారికి కావాల్సిన సమాచారం ఇచ్చారు. పోలీసుల నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుండి ఎలాంటి వాట్సప్ మెసేజ్ రాలేదు. వేరే నంబర్ నుండి వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదని పోలీసులకి వివరణ ఇచ్చారు.


బయటికి వచ్చిన తరువాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు ఎలాంటి వాట్స్ ఆప్ కాల్ రాలేదు. వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదు. 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. పరీక్షల సమయంలో ఒక ప్రధాన మంత్రి నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి ధైర్యం చెప్తున్న ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే. అలాంటి పార్టీలో నేను ఉన్నా. మా పార్టీ పిల్లల భవిష్యత్తు కోరే పార్టీ. 9.30కి పరీక్ష మొదలు అయితే 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ అని ఎలా అంటారు? కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొని ఎలా అయినా మమ్మల్ని ఇరికించాలని కుట్ర పూరితంగా మా మీద కేసులు పెట్టించారు.


టీఎస్పీఎస్సీకి చెందిన ఆరు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. నెగెటివ్ చర్చ జరుగుతుంది అని దానిని డైవర్ట్ చెయ్యడానికి ఈ కేసులు పెడుతున్నారు. చంద్రశేఖర్ కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి రేంజ్ రోవర్ కారులో ఇచ్చానని చెప్తుంటే ఆ చర్చ జరగవద్దు అని పక్కదోవ పట్టిస్తున్నారు. ఆ లీక్ కేస్ పై చర్చ జరగవద్దు అని ఈ డైవర్ట్ చేస్తున్నారు.  


కేసీఆర్ దేశమంతా ఎన్నికల కోసం ఖర్చు పెడతా అని రాజ్ దీప్ సర్‌దేశాయ్ చెప్తున్నారు. ఆ అంశం మీద చర్చ జరగవద్దు అని ఈ కేసులు పెడుతున్నారు. తెలంగాణలో డైట్ ఛార్జీలు ఇవ్వరు, పెన్షన్ సకాలంలో ఇవ్వరు. కాంట్రాక్టర్స్ డబ్బులు రావు కానీ దేశమంతా ఎన్నికల ఖర్చు పెడతారట. ఈ అంశాలన్నింటినీ పక్కదోవపట్టించే ప్రయత్నమే ఈ కేసులు. 


కేసీఆర్ ఓడగొట్టేంత వరకు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవరకు ప్రజలకు అండగా ఉంటా. ఇది ఒక అక్రమ కేసు. TSPSC పేపర్ లీకు కేసుల నుండి ప్రజల ఫోకస్ డైవర్ట్ చేయడానికే ఎస్సెస్సీ కేసులు తెరపైకి వచ్చాయి’’ అని ఈటల రాజేందర్ అన్నారు.