బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. అసలు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత అవసరం లేదని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా చేస్తున్నాయని కొట్టిపారేశారు. డబుల్ బెడ్ రూం సమస్య ఎప్పటి నుంచో ఉందని, ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారని అన్నారు.


తన సైలెన్స్ డైవర్ట్ చేసుకోవడానికి కిషన్ రెడ్డి ఈరోజు తెలంగాణలో డ్రామా చేశారని విమర్శించారు. కిషన్ రెడ్డి తెలంగాణలో తిరిగే ముందు ఈశాన్య రాష్ట్రాల్లో తిరగాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కిషన్ రెడ్డి సమావేశాల్లో పాల్గొనకుండా ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు.


మణిపూర్ విషయంలో మోదీ స్పందించిన తీరుపైన కూడా సీతక్క మాట్లాడారు. ‘‘మణిపూర్ లో దారుణం జరుగుతోంది. 79 రోజుల తర్వాత ప్రధాని మాట్లాడడం బాధాకరం. ఆయనకు ఏం తెలియనట్లుగా చెబుతున్నారు. ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించడానికి మోదీ మాట్లాడారు. మణిపూర్ సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా వుంది. కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరం. గత నెలలో రాహుల్ పర్యటనను అడ్డుకుంది బీజేపీ ప్రభుత్వం. మహిళలు బయటికి రావొద్దని వేడుకున్నారు. మన దేశంలోనేనా జరిగేది అన్నట్లుగా వుంది. 


బీజేపీ సర్కార్ వైఫల్యమే 


ఈశాన్యరాష్ట్రాలకు వున్న స్పెషల్ స్టేటస్ ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలే తప్పా మరేం లేవు. పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు చేస్తున్నారు. మణిపూర్ సీఎం కూడా ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరం. కొట్లాటలు జరుగుతుంటే అక్కడి సీఎం, పీఎంతో డిస్కస్ చెయ్యలేదా? దుర్మార్గంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇంచార్జిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం లేదు. గుజరాత్ లో మోదీ సీఎం గా వున్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారు. 


బీజేపీ సర్కార్ రాజకీయం కోసమే తప్పా ప్రజల కోసం మానవత్వం కోసం పనిచేయడం లేదు. యునైటెడ్ ఇండియా టీమ్ కూడా మణిపూర్ కోసం పనిచేస్తుంది. మణిపూర్ లో జరిగే ఘటనలు బయటికి రావడం లేదు. ఆర్మీ, నెట్ వర్క్  అంతా బీజేపీ చేతుల్లోనే వుంది. మోదీ ఈ దేశంకోసమే పనిచేస్తున్నారా.. లేక పక్క దేశం కోసం పనిచేస్తున్నారా.. మణిపూర్ ప్రజలకు మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే రాజీనామా చేయండి. మానవహక్కులు కాలరాసేలా ఘటనలు మణిపూర్ తోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి’’ అని సీతక్క మాట్లాడారు.