Congress on TSPSC Paper Leak Incident: సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం నైతికత ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య డిమాండ్ చేశారు. వరంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశానికి వెళుతుండగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులను కలిసిన సిరిసిల్ల రాజయ్య మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కూతురు ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉండడం పట్ల సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తూ ఏమాత్రం నైతికత ఉన్న తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి భిన్నంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఈడీ విచారణను నిలుపుదల చేయించే ప్రయత్నం సిగ్గుచేటని, అది చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు. 


బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం 
కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేసే పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం, ఇచ్చిన నోటిఫికేషన్ లలో లోపభూయిష్టమైన విధానాలతో కోర్టు వివాదాలు ఉండగా, ఇప్పుడు నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితి వచ్చిందని దీనికి సీఎం కేసీఆర్ కుట్రే కారణమన్నారు. ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లుగా నటించి నోటిఫికేషన్లపై కోర్టులకు వెళ్లేలా చేయాలని కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఓ చిన్న ఉద్యోగిని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మరోవైపు కుల, మత రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోదీపై రాజ ద్రోహం కేసు పెట్టాలన్నారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆరున్నర దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. కోరుకున్న లక్ష్యాలు నెరవేరటం లేదన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యువత, ఉద్యోగులు పోరాటం చేస్తే రాష్ట్రం సిద్ధించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పాటు కాగా, ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో ఏ లక్ష్యాలు నెరవేరడం లేదని ఆరోపించారు. కోర్టు కేసులతోనే నోటిఫికేషన్లు, ఉద్యోగాల ప్రక్రియను నిలిపివేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. రిటైర్మెంట్ అయిన వారిని సైతం ఉద్యోగాలలో కొనసాగిస్తూ, ఎంతో భవిష్యత్ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని నిర్వీర్యం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.


తుది ఉద్యమానికి తెరలేపుదాం..
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందని, కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని ఇలాంటి విషయాలలో నైతిక బాధ్యత వహించి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఎలాంటి నైతికత లేకుండా తమను విచారణకు పిలవొద్దనంటూ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. విచారణ సంస్థలు తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాయని, కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్రంలో ఖర్చు పెట్టకుండా దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు.