ప్రభుత్వ ఉద్యోగం రావడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో రాసి పెట్టి ఉండాలి. కొందరు సంవత్సరాల తరబడి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంటారు. అయినా ఒకటీ, రెండూ మార్కులతో మిస్ అవుతుంటుంది. అయినా అలుపెరుగని విక్రమార్కుడిలా కూర్చుని పుస్తకాలతో కుస్తీలు పడతారు. రాత్రింబవళ్లు కూర్చుని చదువుతూనే ఉంటారు. అయినా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ ఉండదు.
వచ్చిన వాళ్లకే వస్తుంటాయి..
విశ్వవిద్యాలయాల్లో, స్టడీ సర్కిళ్లలో, కోచింగ్ సెంటర్లలో వేల మంది ప్రభుత్వ ఉద్యోగార్థులు కష్టాలు పడుతుంటారు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతి దానికీ అప్లై చేస్తూ పోతారు కొంత మంది. మరికొంత మంది మాత్రం గ్రూప్స్ అని, ఎస్ఎస్సీ అని ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం అంత సులభం ఏమీ కాదు. పక్కా వ్యూహంతో ప్రిపేర్ అయితే తప్ప ప్రభుత్వ ఉద్యోగం రాదు. అలా ప్రిపేర్ అయిన ఎంతో మంది ఒకటికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటాయి. అలా వచ్చిన వారు.. అన్ని బేరీజు వేసుకుని ఏది ఉత్తమం అనిపిస్తే అందులో చేరిపోతారు. మిగతావన్నీ వదిలేసుకోవాల్సిందే.
రెండు ఉద్యోగాల్లోనూ చేరిపోయాడు..
అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తికి కూడా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. లెక్క ప్రకారం, ఏదో ఒకటి ఎంచుకోవాలి. మరో దానిని వదిలి వేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం నేరం. ఆ వ్యక్తికి కూడా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అయితే కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకేదాన్ని ఎంచుకుని మరోదాన్ని వదిలివేయడానికి మనసు ఒప్పలేదేమో.. రెండింట్లోనూ చేరిపోయాడు. రెండు ఉద్యోగాలు చేశాడు. రెండూ ఉద్యోగాల జీతాలతో చాలా హ్యాపీగా బతికేశాడు. ఎవరికీ ఏ అనుమానం రాకుండా పకడ్బందీగా వ్యవహరించాడు. చాలా సంతోషంగా ఉద్యోగాల నుంచి రిటైర్ కూడా అయ్యాడు. కానీ ఆయా ప్రభుత్వ ఉద్యోగాల పింఛన్ల కోసం అప్లై చేయగా... అసలు బండారం బయట పడింది.
ఎక్కడా అనుమానం రాకుండా ఉద్యోగాలు..
హనుమకొండ జిల్లా కిషన్ రావుకు చెందిన ఎస్కే సర్వర్ రెండు వేర్వేరు తేదీల్లో పుట్టినట్లుగా ధ్రువీకరణ పత్రాలు పొందాడు. ఒక దానిని కాకతీయ విశ్వ విద్యాలయంలో.. మరొకటి పోలీసు శాఖలో పెట్టి అటెండర్ ఉద్యోగాలు చేశాడు. ఎక్కడా, ఎవరికీ డౌట్ రాకుండా చూసుకున్నాడు. రెండు చోట్లా పదవీ విరమణ పొందాడు. అతనికి రావాల్సిన పింఛను కోసం డీటీవో కార్యాలయంలో అప్లై చేసుకున్నాడు.
డీటీవోకు అనుమానం రావడంతో..
పింఛను దరఖాస్తు పరిశీలించినప్పుడు ఇతను రెండు చోట్లా ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసినట్లు వెలుగులోకి రావడంతో డీటీవో ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. వరంగల్ సీపీ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎస్కే సర్వర్ రెండు చోట్లా ఎలా ఉద్యోగం చేశాడనేది అధికారులకు కూడా అంతుబట్టడం లేదు. అసలు ఉద్యోగాలు ఎలా చేశాడు అనేది విచారణలో వెల్లడి అవుతుందని సుబేదారి పోలీసులు తెలిపారు.