BRS Public Meeting: ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు కేరళ, దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లు ప్రారంభించారు. అలాగే వీరితో పాటు యూపీ మాజీ సీఎం, సీపీఐ జాతీయ నేత జీ రాజా ఉన్నారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలికాప్టర్ లో సీఎంలు, జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు. వీరికి జిల్లా బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నూతనంగా నిర్మించిన ఖమ్మం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరన వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ గురించి ముఖ్యమంత్రి జాతీయ నేతలకు వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. 






వెంకటాయపాలెం వద్ద కలెక్టరేట్ నిర్మాణం.. 


అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు కూడా చేశారు. ఆ తర్వాత చాంబర్ లో కలెక్టర్ వీపీ గౌతమ్ ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరున చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని భావించారు. ఆ తర్వాత భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కాల్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఇందులో భాగంగానే ఖమ్మం వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు నూతన కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించింది. వెయ్యి అడుగుల ఫేసింగ్, 11 వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి 53.20 కోట్ల రూపాయల ఖర్చు అయింది.


యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎంలు..


యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఓ మాజీ ముఖ్యమంత్రితో సందడిగా మారింది. సీఎం కేసీఆర్‌ సహా ముగ్గురు సీఎంలు నేడు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అల్పాహారం ముగించుకొని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి సీఎంలు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. వారితోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నేతలు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.