ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ, అందులో ప్రజలే గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. మాయ చేసేవారిని గెలిపించవద్దని కోరారు. గత రెండు దఫాలుగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను గెలిపించుకున్నారని, అద్భుతమైన ప్రగతి చూస్తున్నారని అన్నారు. మహబూబాబాద్‌కు పరిశ్రమలు కూడా రావాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరారని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదని అన్నారు. పక్కన కర్ణాటకలో కూడా 24 గంటల కరెంటు హామీ ఇచ్చి ఇప్పుడక్కడ పొలాలు ఎండబెడుతున్నారని విమర్శించారు. మహబూబాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.


ధరణి తీసేసి బంగాళాఖాతంలో విసిరేస్తామని రాహుల్ గాంధీ, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అంటున్నారని గుర్తు చేశారు. బంగాళాఖాతంలో వేస్తామన్న వారినే తీసి బంగాళాఖాతంలో వేస్తామని అన్నారు. ధరణి వల్ల రైతు బంధు, రైతు బీమా డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయని అన్నారు. పోడు సాగుదారులు అందరికీ పట్టాలు ఇచ్చామని, గతంలో వారిపై నమోదు చేసిన కేసులు మొత్తాన్ని మాఫీ చేశామని చెప్పారు. పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా, వారికి రైతు బంధు ఇచ్చామని చెప్పారు.


‘‘తెలంగాణ వచ్చింది కాబట్టి మహబూబాబాద్ జిల్లా అయింది. పట్టుబట్టి జిల్లా చేయించిన. అభివృది ఫలితాలు కన్పిస్తున్నాయి. అకేరు, మున్నేరు నది పొడవునా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అద్భుతంగా పంటలు పండిస్తున్నారు. మహబూబాబాద్ లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి. రెండు ఎలక్షన్లలో శంకర్ నాయక్ ను గెలిపించినందుకు అభివృద్దిని చూస్తున్నారు. మీ ఊర్లకు పోయి నేను చెప్పినదాన్ని చర్చించండి. నిజమేంటో తెలుసుకోండి. మాకు పరిశ్రమలు రావాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలని కోరుతున్నారు’’


గుజరాత్ లో కూడా కరెంటు లేదు
‘‘ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు సరఫరా లేదు. వాళ్లు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నరు. నాడు ఎరువుల కోసం చెప్పులు లెన్లులో పెట్టినం. నేడు పుష్కలంగా  ఎరువుల లభ్యం అవుతున్నాయి. ధాన్యం అమ్మితే నేరుగా బ్యాంకు ఖాతాలో జమయితా ఉన్నాయి. రైతు బందు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణితో లాభాలే ఉన్నాయి కానీ, నష్టాలు లేవు. మీ భూమి మీద మీకే అధికారం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. ధరణి పోతే పైరవీ కారులు అధికారులు మళ్లా లంచాల వ్యవహారం మొదటికొస్తాయి. నేడు నేరుగా మీ ఖాతాల్లోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ వస్తే ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండదు. పదేళ్ల నుంచి ప్రజారాజ్యం నడుస్తున్నది. 


25 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చినం. పోలీస్ కేసులు రద్దు చేసినం. రైతుబంధు, భీమా కూడా ఇచ్చినం. మేం ఎలక్షన్ల పేరుతో అబద్ధాలు చెప్పం. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధును క్రమంగా 16 వేలు చేస్తాం. పెన్షన్లు కూడా పెంచుకుందాం, మహిళలకు 3 వేల రూపాయలు ఇస్తాం. విద్యాసంస్థలను కూడా  పెంచుతాం.


తెలంగాణలో అద్భుతమైన అభివృద్ది జరిగింది. ఈ అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించండి. 60 ఏళ్లు మోసం చేసిన కాంగ్రెస్ నయా మోసం, నయా అబద్దాలు చెప్తుతూ మళ్లీ మీ ముందుకు వస్తుంది. దయచేసి వారికి ఓటు బుద్ధి చెప్పండి. ఇంత భారీ ఎత్తున తరలివచ్చిన జనాన్ని చూస్తే ఈ సభ ద్వారా బీఆర్ఎస్ గెలవబోతుందని రుజువయింది’’ అని కేసీఆర్ మాట్లాడారు.