Warangal News: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగులుతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హనుమకొండలోని ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఇంటికి వెళ్లడం రాజకీయ చర్చకు దారితీస్తుంది. సీతారాం నాయక్ పార్టీ మారడానికి సిద్ధం కావడంతో బిజెపిలోకి ఆహ్వానించడానికి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. కొద్దిసేపు సీతారాం నాయక్ తో కిషన్ రెడ్డి భేటీ అయి.. అనంతరం ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చారు. 


ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. 2024- 25 అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు ప్రొఫెసర్ సీతారాం నాయక్. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ గిరిజన రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. స్థానిక ఎంపీగా ఉన్నప్పుడు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ రావాల్సి ఉంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ చేయకుండా గిరిజనులకు అన్యాయం చేసిందని కిషన్ రెడ్డి అన్నారు.


2014 నుండి గిరిజనుల రిజర్వేషన్లు పట్టించుకోకుండా మొన్నటి ఎన్నికల ముందు రిజర్వేషన్ జీవోను బీఆర్ఎస్ తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ఆలస్యం చేస్తుందని అన్నారు. కేసీఅర్ కేంద్రాన్ని తప్పట్టారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గిరిజన యూనివర్సిటీ కావాల్సిన వెంటనే చేయాలని కిషన్ రెడ్డి కోరారు. 


సీతారాం నాయక్ పార్టీలోకి ఎప్పుడు వస్తున్నారని కిషన్ రెడ్డిని అడగగా ఆ విషయం ఆయన్నే అడగాలని ఆయన సమాధానం చెప్పారు. రెండు సార్లు మూడుసార్లు ముఖ్యమంత్రి కావచ్చు గాని ఒక ప్రొఫెసర్ కు రెండోసారి ఎంపీగా అవకాశం ఇవ్వక పోవడం ఏమిటని సీతారాం నాయక్ అన్నారు. తాను చాలా అసంతృప్తిలో ఉన్నానని పార్టీ పైన గానీ నాయకత్వం పైన నిందలు వేయబోనని సీతారాం నాయక్ అన్నారు. తనకు ఆశయాలు ఉన్నాయని ఏ పార్టీలోనైతే గౌరవం దక్కదో.. అక్కడ ఉండలేనని అన్నారు. గౌరవం దక్కే పార్టీలోకి వెళ్తానని ప్రొఫెసర్ సీతారాం నాయక్ స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని అన్నారు. అయితే, ఇది తాను ఒకడితే తీసుకునే నిర్ణయం కాదని.. భవిష్యత్తులో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సీతారాం నాయక్ చెప్పారు.