Eatala Rajender: బీజేపీ అధికారంలోకి రాగానే ఇంట్లో ఉండే ఇద్దరు వృద్ధులకు పింఛన్ అందజేస్తామని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. పైగా రైతుబంధు కూడా సంపన్నులకు కట్ చేస్తామని చెప్పారు. రైతు బంధు అనేది సంపన్నులకు అవసరం లేదని అన్నారు. సోమవారం (జూలై 24) ఈటల రాజేందర్ హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. తాము కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తొలగించే వరకూ విశ్రమించబోమని ఈటల రాజేందర్ చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ బీజేపీ దశల వారీగా ఆందోళన చేస్తుందని అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల పేరుతో ఖర్చుచేస్తున్న డబ్బులు కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఉంటోందని, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రూ.45 వేల కోట్లు ఉంటోందని అన్నారు. మద్యం తాగుతున్న పేదలు ద్వారా వచ్చే డబ్బులను కూడా వారి కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు. దీనిపై దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. యువతను నిర్వీర్యం చేస్తున్న పాపం ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ అనుకూల మీడియాలో ఓ వర్గం మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఇళ్లు లేని పేదలు ఎన్నో అవస్థలు పడుతున్నారని కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం హామీని లబ్ధిదారులు అందరికి అందేలా పని చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
విద్యావ్యవస్థపైనా విమర్శలు
ఆదివారం (జూలై 23) హైదరాబాద్ లోని జలవిహార్‌లో ఈటల రాజేందర్ మాట్లాడారు. రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక అధ్యక్షతన జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి పేదలకు ఉన్నత విద్య దూరం చేశారని విమర్శించారు. 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ పేరుతో దాదాపుగా 8 వేల స్కూళ్లను మూసివేశారని అన్నారు. పీహెచ్‌డీ చేసినవారు రూ.5 వేలకు పని చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
దళిత బంధు, బీసీలకు లక్ష రూపాయల సహాయం అనేది ఓట్ల కోసమేనని విమర్శించారు. కేసీఆర్‌కు అధికారంపై ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదని అన్నారు. పుట్టిన పిల్లలపై రూ.1.25 లక్షల అప్పు చేశారని అన్నారు. వచ్చే నెల 6న అన్ని వర్గాల సమస్యలను పుస్తకం రూపంలో విడుదల చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్, జస్టిస్ నరసింహా రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారులు అరవింద్ రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రతినిధి పేరాల శేఖర్‌రావు, తుర్క నరసింహ, అశ్వత్థామ రెడ్డి, విఠల్, ప్రొఫెసర్ గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు.