Bhadrachalam Laddu: Devotees angry after they foud Fungus to Laddus at Bhadrachalam Temple
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భద్రాచలం సీతారాముల వారి ఆలయం ఒకటి. అయితే శ్రీరాముడి సన్నిధిలో తమకు పాచిపోయిన లడ్డూలు, బూజు పట్టిన లడ్డూలు పంపిణీ చేస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం రామాలయంలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంతో పవిత్రంగా భావించే స్వామి వారి ప్రసాదం నాణ్యత డొల్లగా మారింది.
ఎవరైనా చట్టుపక్కల వారు పుణ్య క్షేత్రాలకు వెళ్లొస్తే ప్రసాదం ఎక్కడా అని అడుగుతుంటాం. కానీ భద్రాచలం రాములోరి దర్శనం చేసుకున్న భక్తులు మాత్రం ప్రసాదం తమ స్నేహితులకు, బంధువులకు ఇవ్వడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. బూజు పట్టిన లడ్డూలు ఇస్తున్నారని చెబితే వారు నమ్మరని, లడ్డూలు లేవు అని చెప్పలేక ఇలా చెబుతున్నారా అని అడుగుతారని భక్తులు ఈ రకంగానూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం సీతారాముల ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. యాదాద్రి ప్రసాదం, భద్రాచలం ప్రసాదం తెలంగాణలో ఫేమస్. కానీ భద్రాచలం ఆలయంలో రాములొరి ప్రసాదంలో బూజుపట్టిన లడ్డూలు పంపిణీ చేస్తున్నారు. తమకు వచ్చిన లడ్డూలు పాచి పోయి ఉండటం, బూజు పట్టి ఉండటాన్ని గమనించిన భక్తులు ఆలయ నిర్వాహకులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును..
ముక్కోటి పర్వదినం సందర్భంగా భక్తులు కోసం దాదాపు రెండు లక్షల లడ్డూలను భద్రాచలం ఆలయ సిబ్బంది తయారు చేసింది. భక్తులకు పంపిణీ చేయగా మిగిలిపోయిన లడ్డూలను సరిగా భద్రపరచలేదు. దీంతో ఆ లడ్డూలు ఫంగస్, బూజు పట్టాయి. వాటిని సిబ్బంది భక్తులకు ప్రసాదంగా విక్రయించారు. ఆగ్రహించిన భక్తులు లడ్డూల కౌంటర్ వద్ద ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును అని రాసి నోటీసు సైతం అతికించారు. ఈ నోటీసు ఆలయం ప్రసాదం కౌంటర్ వద్ద కలకలం రేపింది. లడ్డూలకు ఫంగస్ వస్తే అవి తీసేసి, నాణ్యత ఉన్న లడ్డూలు విక్రయించాలి కానీ, రాములోరి భక్తులకు ఇలా పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అంటూ భక్తులు గొడవకు దిగుతున్నారు.
అవసరమైన మోతాదుకు మించి ఆలయాలలో లడ్డూలూ తయారు చేయడం సహజమే కానీ చేసిన లడ్డూలను ఆరబెట్టి భద్రపరచంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి ఇలాగే మారుతుందని భక్తులు అంటున్నారు. లడ్డూలను చేసిన వెంటనే కొంచెం సేపు గాలికి ఆరబెట్టడం వల్ల బూజు పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో చల్లని ప్రదేశాల్లో ఉంచడం ద్వారా కొన్ని రోజులు ఆ లడ్డూలు నిల్వ ఉంటాయి. అధిక వేడి వాతావరణంలో నిల్వ చేయడం, లేక నిర్లక్ష్యంగా లడ్డూలను భద్రపరచడం ద్వారా కొంతమేర ఫంగస్ వచ్చి లడ్డూలు బూజు పట్టే అవకాశం ఉంటుంది. రెగ్యూలర్ గా ఈ పనిచేసే సిబ్బంది లడ్డూల నిర్వహణపై అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా లడ్డూలు బూజు పట్టాయని, కానీ అదేమీ గమనించకుండా వాటిని తమకు విక్రయిస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు.