తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. మంగళ వారం ఉదయం 8 గంటలకు 50.2 అడుగులు ఉన్న వరద మధ్యాహ్నం 12 గంటలకు 50.9 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా... 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉద్ధృతితో భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాలు చాలా వరకు మునిగిపోయాయి. భక్తులు తల నీలాలు సమర్పించే కల్యాణ కట్ట కింద వైపు నీరు చేరింది. గోదావరి కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. అలాగే లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పొంచి ఉన్నందున స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు.
అధికారులు అంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. గజ ఈతగాళ్లు, బోట్లు లాంచీలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదం వాటిళ్లినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షణ చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే భద్రాచలం, దుమ్మగూడెం మండలాల పరిధిలో పలు చోట్ల వరద నీరు చేరింది. నదిలో ఇంకో రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగితే తీర ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరో 36 గంటల్లో ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్‌కు చేరుకుంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, యానాంలలో వీచనున్నాయి. ఏపీ, తెలంగాణ, యానాంలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో సెప్టెంబర్ 14 వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిశాయి. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.
నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.