Bhadradri Kothagudem: తెలంగాణ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ సింగరేణి పై పాట రూపొందించారు. దీంట్లో సింగరేణి వాసులను భాగస్వామ్యం చేసి చిత్రీకరించేందుకు కొత్తగూడెంలో ఈ నెల 21న ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. 


"అమ్మ పాడే జోల పాట" అనే పాట గత నెలలో యూట్యూబ్ లో విడుదలై 30 రోజుల్లోనే దాదాపు 20 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. మిట్టపల్లి స్టూడియో ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఈ పాట బాగా ట్రెండ్ అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు జానపద, సినీ గేయ రచయిత మిట్ట పల్లి సురేందర్ దీని రూపకర్త. సురేందర్‌ది తెలంగాణ ఉద్యమ గీతాల రచనలో అందెవేసిన చెయ్యి. తెలంగాణ కోసం అమరులైన యువకుల బలిదానాలపై ఆయన రాసిన ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తం బంధం విలువ నీకు తెలియదురా’’ అనే పాట తెలంగాణ ప్రజల గుండెల్ని కదిలించింది. తెలంగాణ ఉద్యమ పాటలు, జానపద గేయాలతో పాటు తొమ్మిది సినిమాలకు 20 వరకు సినీగేయాలు సైతం ఆయన రాశారు.


సింగరేణిపై కొత్త పాట


ప్రస్తుతం మిట్టపల్లి సురేందర్ తెలంగాణలోని సింగరేణి కాలరీస్ పై ఓ పాట రూపొందించేందుకు సంకల్పించారు. పాట ఇప్పటికే రూపొందింది.  సింగరేణి ఏరియాకి చెందిన పారనంది ఈశ్వర ప్రసాద్ అనే ర్యాపర్ ఈ పాటను ఆలపించారు.  గతంలో సురేందర్ చేసిన పాటలు విశేష ఆదరణ చూరగొన్న నేపథ్యంలో దీన్నీసైతం భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు మిట్టపల్లి స్టూడియోస్ ప్రయత్నిస్తోంది. ఈ సింగరేణి పాటలో సింగరేణీ ప్రాంతవాసులని భాగస్వాములని చేయాలని నిర్ణయించినట్లు మిట్టపల్లి స్టూడియో సీఈఓ పుల్ల సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.


కొత్తగూడెంలో ఆడిషన్స్ 


ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీన ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో నివసిస్తోన్న సింగరేణి ప్రాంతానికి చెందిన  యువ నృత్యకళాకారుల ఎంపిక కోసం ఆడిషన్స్ జరుగనున్నాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో భజన్ మందిర్ రోడ్డులో గల పద్మశాలి భవనంలో ఈ "డాన్స్ ఆడిషన్స్" నిర్వహిస్తున్నామని సతీష్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని యువ నృత్య కళాకారులు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు వయసు గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.  ఈ ఆడిషన్స్ లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు కొత్తగూడేనికి చెందిన గాజుల శ్రీనివాసరావు 9110530053 ఫోన్ నెంబరుని సంప్రదించాలని కోరారు.