Ghost Fear In Jangalapalli Village In Mulugu District | ములుగు జిల్లాలోని జంగాలపల్లి గ్రామాన్ని దెయ్యం, మూఢ నమ్మకాలు వెంటాడుతున్నాయి. గత రెండు నెలల నుంచి గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో గ్రామానికి కీడు సోకిందని వణికిపోతున్నారు. గ్రామానికి పట్టిన కీడుతోనే అనారోగ్యం బారిన పడి చనిపోయారనే భయంతో ఆందోళన చెందుతున్నారు.
గ్రామానికి కీడు సోకింది... దెయ్యం తిరుగుతోంది..
ములుగు జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదానికి అనుకొని ఉన్న జంగాలపల్లి గ్రామాల్లో రెండు, మూడు నెలలుగా 30 మంది పలు ఆనారోగ్య కారణాలతో చనిపోయారు. అయితే గ్రామంలో ఒకరి దశదిన కర్మ ముగియకముందే మరొకరు చనిపోవడంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. దీంతో కొద్ది రోజులుగా గ్రామంలోని ప్రతి ఇంటిని కీడు లేదా దెయ్యం పట్టిందని గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ భయంతో రోజులు వెల్లదీస్తున్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడంటే చాలు గ్రామస్తులు ఇళ్లలో నుండి బయటకు రావడం లేదు. గ్రామాల్లో ఎవరు కలిసినా, పనులకు వెళ్లినా ఊరికి పట్టిన శని, వరుస మరణాలపై మాట్లాడుకుంటున్నారు.
బొడ్రాయి ప్రతిష్టాపన భయం
గ్రామస్తులను ప్రధానంగా బొడ్రాయి భయం వెంటాడుతుంది. గ్రామానికి కీడు, దయ్యాలు, ఆత్మలు రాకుండా కాపాడే బొడ్రాయిని పునః ప్రతిష్టించకపోవడంతో కీడు సోకి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు గట్టిగా నమ్ముతున్నారు. బొడ్రాయి ఏర్పాటు చేసి చాలా ఏళ్లు కావడంతో దుష్ట శక్తుల ప్రభావం పెరిగి.. దెయ్యాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు.
దెయ్యం లేదు... భూతం లేదు....
రెండు, మూడు నెలల్లోనే జంగాలపల్లి లో 30 మంది వరకు మరణించారు. కీడు జరిగి, గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. జంగాలపల్లికి దెయ్యం పట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ములుగు జిల్లా వైద్య అధికారులు రంగంలోకి దిగి మరణాలపై నిగ్గు తేల్చారు. పలు అనారోగ్య కారణాలతో రెండు నెలల్లో 30 మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు ఏబీపీ దేశంతో చెప్పారు.
10 మంది అరవై ఏళ్లు దాటినవారు, వృద్ధాప్య సమస్యలతో, 10 మంది బీపీ, షుగర్ సమస్యలతో చనిపోయారని వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు తెలిపారు. ఒకరు క్యాన్సర్ తో, ఒకరు ఆల్కహాలు ఎక్కువ తీసుకోవడంతో ఒకరు చనిపోగా, కిడ్నీ వ్యాధితో నలుగురు, బ్రెయిన్ స్ట్రోక్ తో నలుగురు మృతి చెందినట్లు డీఎం అండ్ హెచ్ వో తెలిపారు. కొద్ది రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యక్తి అనారోగ్యంతో నాటు వైద్యం తీసుకుని పసరు మందు తాగి చనిపోవడంతో వారిలో మూఢనమ్మకం భయం మరింత ఎక్కువైందని ఆయన చెప్పారు.
గ్రామాల్లో మెగా హెల్త్ క్యాంప్...
గ్రామంలో భయాన్ని తొలగించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 15 మంది డాక్టర్లు, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్ల తో 10 టీం లను ఏర్పాటు చేసి మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దెయ్యాలు, భూతాలు లేవని గ్రామస్తుల్లో అవగాహన కల్పిస్తున్నామని డీ ఎం అండ్ హెచ్ వో తెలిపారు. అంతే కాకుండా ఆంటీ లార్వా, వాటర్ శాంపిల్స్ సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.