Maoist Ganesh : ఒడిశా పోలీసులు, భద్రతా దళాలు క్రిస్మస్ రోజున ఒక పెద్ద ఆపరేషన్‌లో CPI (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఒడిశాలో మావోయిస్ట్ కార్యకలాపాల ప్రధాన కమాండర్ ఉయికే గణేష్‌ను హతమార్చారు. 69 ఏళ్ల గణేష్ ఉయికేపై రూ. ఐదు కోట్లు రివార్డ్ ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు మావోయిస్టులు మరణించారు, వీరిలో ఇద్దరు మహిళా క్యాడర్లు ఉన్నారు.
SOG, CRPF, BSF కలిసి ఎన్‌కౌంటర్ చేశాయి
ఒడిశా పోలీసుల నక్సల్ ఆపరేషన్స్ DIG అఖిలేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, 'ఒడిశా స్పెషల్ ఫోర్స్ SOG, CRPF, BSF సంయుక్త బృందాలు ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఒడిశాలోని కంధమాల్ జిల్లా, గంజాం జిల్లా సరిహద్దుల్లో ఉన్న రాంపా అడవుల్లో గణేష్ ఎన్‌కౌంటర్ జరిగింది.'
గత 40 సంవత్సరాలుగా గణేష్ మావోయిస్టు సంస్థలో చురుకుగా పనిచేస్తున్నాడు. దండకారణ్య ప్రాంతంలో స్థానిక స్థాయిలో మావోయిస్టు సంస్థను బలోపేతం చేయడంలో, భద్రతా బలగాలపై తీవ్రమైన దాడులకు ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గణేష్ బీఎస్సీ డిగ్రీ చేసిన తర్వాత అడవి బాట పడ్డాడు. ప్రస్తుతం అతను ఒడిశా రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో అతనిపై ఐదు కోట్ల రూపాయలకుపైగా రివార్డు ఉంది.
గణేష్ తెలంగాణలోని నల్గొండ జిల్లా పులిమెల గ్రామానికి చెందినవాడు. మావోయిస్టుల అగ్రశ్రేణి కేంద్ర కమిటీలో సభ్యుడైన గణేష్ ఉయికే మరణం మావోయిస్టు సంస్థకు ఒక పెద్ద దెబ్బ.
ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టురహిత రాష్ట్రంగా ఒడిశా
ఈ ఎన్‌కౌంటర్‌పై సోషల్ మీడియాలో స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒడిశాలో మావోయిస్టులను ఏరివేశామని ప్రకటించారు. మార్చి 31 నాటికి మావోయిస్టుల చాప్టర్ క్లోజ్ అవుతుందని పునరుద్ఘాటించారు.