Warangal News : భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్లు వినూత్న ఆలోచనలు చేస్తుంటాయి. కొందరు సర్వింగ్ కోసం రోబోలను వాడుతుంటే మరికొందరు టాయ్ ట్రైన్ వినియోగిస్తున్నారు. అయితే వరంగల్ ట్రైన్ రూపంలో రూపొందిన రెస్టారెంట్ ఆకట్టుకుంటుంది. ఈ  టాయ్‌ ట్రైన్‌ రెస్టారెంట్‌, ప్లాట్‌ఫామ్ 65కు వరంగల్‌లో భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. ప్లాట్‌ఫామ్‌ 65 ఆధ్వర్యంలో వినూత్నమైన డైనింగ్‌ కాన్సెప్ట్‌, భోజన ప్రియులకు అద్వితీయమైన ఆహార అనుభవాలను అందించడంతో పాటు, ఆహారాన్ని బొమ్మ రైలులో సప్లయ్​ చేస్తున్నారని కస్టమర్స్ చెబుతున్నారు. వినియోగదారులకు మల్టీ క్యూసిన్ రుచులను విలాసవంతమైన వాతావరణంలో అందిస్తున్నారు. ఈ నూతన ఔట్‌లెట్‌ ను వరంగల్‌ మార్కెట్‌ వద్ద ఏర్పాటుచేశారు. 


నోరూరించే వంటకాలు 


ఆహార ప్రియుల నుంచి ప్రశంసలు పొందడంతో పాటు రెండేళ్లలో అత్యద్భుతమైన కస్టమర్‌ రివ్యూలను పొందిన ప్లాట్‌ఫామ్‌ 65 తమ శాఖలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో విస్తరిస్తోంది. ఇటీవలే తమ ఏడో ఔట్ లెట్‌ను బెంగళూరులో కూడా ప్రారంభించారు. ఇక వరంగల్‌లో తమ నూతన ఔట్‌లెట్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్లాట్‌ఫామ్‌ 65 తమ వినియోగదారులకు నోరూరించే ఆంధ్ర, తెలంగాణ, చైనీస్‌ వంటకాల రుచులను అందిస్తుంది.


రైల్వే స్టేషన్ తరహాలో 


ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని రైల్వే స్టేషన్‌ తరహాలో డిజైన్‌ చేశారు. ఇక్కడ సీట్లు రైల్‌ సీట్లను ప్రతిబింబించడంతో పాటు ప్రతి టేబుల్‌ బెంగళూరు, మైసూర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, హైదరాబాద్‌, సంగారెడ్డి, విజయవాడలో తదితర పేర్లతో ఏర్పాటుచేశారు. ఈ రైలు ఒకేసారి రెండు మీల్స్‌ను మోసుకుని వెళ్తుంది. ఆ ట్రైన్ ను చూసి చిన్నారులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరహా థీమ్‌ రెస్టారెంట్‌లు వరంగల్‌కు మరింత మంది పర్యాటకులకు ఆకర్షిస్తాయని కస్టమర్స్ అంటున్నారు.