Warangal MP Pasunuri Dayakar decided to join Congress : వ‌రంగ‌ల్ బీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ కాంగ్రెస్‌లో చేరేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. వ‌రంగ‌ల్ ఎంపీ టికెట్ విష‌యంలో కేసీఆర్ మాదిగ‌ల‌కు అన్యాయం చేశార‌ని ఆరోపిస్తూ వ‌స్తున్నారు. వ‌రంగ‌ల్ ఎంపీ టికెట్‌ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప‌సునూరి ద‌యాక‌ర్‌కు కాకుండా క‌డియం శ్రీహరి కుమార్తె య కావ్య‌కు కేసీఆర్‌ ప్ర‌క‌టించారు.  తీవ్ర అసంతృప్తితో ఉన్న ద‌యాక‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.   


రేవంత్ రెడ్డి, పసునూరి దయాకర్  కాలేజీలో కలసి చదువుకున్నారు. ఫైనార్ట్స్ కోర్సును ఒకే కాలేజీలో పూర్తి చేశారు.  ఇద్దరూ ఒకే సారి లోక్‌స‌భ‌లో ఎంపీగా ప‌నిచేశారు.  రేవంత్‌తో ఉన్న వ్య‌క్తిగ‌త సాన్నిహిత్యం కూడా ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఆలోచ‌న‌ల‌తోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది. ఈ మేర‌కు మంత్రి కొండా సురేఖ‌తో  మంత‌నాల అనంత‌రం స‌చివాల‌యంలో ఉన్న‌ సీఎం రేవంత్ రెడ్డి వ‌ద్ద‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా ఆయ‌న సంకేతాలు పంపారు.  


వరంగల్ ఎంపీ టిక్కెట్ ను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదు. అద్దంకి దయాకర్ పేరు వినిపించినా తర్వాత వెనుకబడిపోయింది.  టిక్కెట్ ఆశించి  మాజీ ఎమ్మెల్యే రాజయ్య పార్టీలో చేరేందుకు  ప్రయత్నించారు. కానీ ఆయనను ఇంకా చేర్చుకోలేదు. రిజర్వుడు నియోజకవర్గం కావడంతో  బలమైన అభ్యర్థుల కాంగ్రెస్  ప్రయత్నిస్తోంది. సపునూరి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో గెలిచిన పసునూరి దయాకర్..  2019 ఎన్నికల్లో  కూడా గెలుపొందారు.


కాంగ్రెస్ పార్టీలో చేరే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉదయమే  మాజీ మంత్రి దానం నాగేందర్   కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.   దానం నాగేందర్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హైదరాబాద్ మొత్తం  చక్రం తిప్పారు. మంత్రిగా ఆయన ఏం చెబితే అది జరిగేది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మంత్రిగా ఉన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసినా..  టీడీపీతో  పొత్తులో భాగంగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు తర్వాత  బీఆర్ఎస్ లో చేరి.. 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో ఓ సారి కాంగ్రెసె టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి  రావడంతో మళ్లీ టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ లో చేరనున్నారు. సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారన్న ప్రచారం జరుగుతోంది.