Warangal News : వరంగల్ లో ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా రాయుళ్లు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న నగరం వరంగల్. హైదరాబాద్ ట్విన్ సిటీ అయితే. వరంగల్ కు  ట్రై సిటీగా పేరుంది. భూముల ధరలకు అమాంతం పెరగడంతో కాకతీయుల రాజధాని ఇప్పుడు కబ్జాలకు కేంద్రంగా మారింది. కబ్జారాయుళ్లతో ప్రజలు తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  


కబ్జాల జిల్లాగా ఓరుగల్లు


వరంగల్ జిల్లాను కబ్జాల జిల్లాగా మార్చేస్తున్నారట కొందరు నేతలు. కబ్జాకోరులకు నేతల అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నారని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు కబ్జాల్లో పోటీ పడుతున్నారట. కొందరు నకిలీ పాత్రలు సృష్టించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే... మరికొందరు వారికున్న అంగబలం, రాజకీయ పలుకుబడితో కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కిన కబ్జాదారుల పలుకుబడి ముందు న్యాయం జరగడంలేదని బాధితులు వాపోతున్నారు. దీంతో లక్షల విలువచేసే భూములను కోల్పోతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  


 ఓరుగల్లు ఐటీ విషయంలో చేదు అనుభవం


రీసెంట్ గా మంత్రి కేటీఆర్ విదేశీల పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకు అనుకోని అనుభవం ఎదురైనట్లు సమాచారం. విదేశీ పర్యటనలో భాగంగా ఒక్క హైదరాబాద్ లోనే కాదు… వరంగల్ జిల్లాలో కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లను కోరారట మంత్రి కేటీఆర్. దానికి విదేశాల్లో ఉంటున్న వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి… పెట్టుబడులు తర్వాత సంగతి సార్.. మా భూములను కొందురు  ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తున్నారని, ఎలా రావాలని అని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారట. దీంతో సమావేశం ముగిసిన తర్వాత వరంగల్ పోలీస్ కమీషనర్ కు ఫోన్ చేసి కబ్జాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని,  కబ్జాల వెనుక ఎవరూ ఉన్న వదలొద్దని కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 


బీఆర్ఎస్ నేత అరెస్టు 


 వరంగల్ ట్రై సిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి హంగామా చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు ఈ వ్యవహారల్లో జోక్యం చేసుకుని కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భూ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను హన్మకొండ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. భూ కబ్జాకు పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు సెకండ్ అడిషనల్  ​జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్​మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంతరం వేముల శ్రీనివాస్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.


200 గజాల భూమి కబ్జా... డెవలప్ మెంట్ పేరుతో హై డ్రామా


హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ​డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్  ​మీదికి వెళ్లి కాంపౌండ్​ వాల్  ​ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు  హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బీఆర్ఎస్ నేతను అరెస్టు చేశారు.