Graduate MLC By Election: వరంగల్​ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ (Graduate MLC) ఉప ఎన్నిక ఓట్ల (By Election Counting) లెక్కింపు గురువారం సాయంత్రం కొనసాగుతోంది. గురువారం సాయంత్రం మూడో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మూడో రౌండ్​ పూర్తయ్యేసరికి కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న (Teenmar Mallanna) 18,878 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాల్గో రౌండ్ ఓట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 


మూడో రౌండ్​ ఫలితాలు
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,06,234 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 34,516 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 27,493 నమోదయ్యాయి. మూడు రౌండ్లు ఫలితాలు వెల్లడికాగా తీన్మార్‌ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


అభ్యర్థులకు వచ్చిన ఓట్లు



  • తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) : 1,06,234

  • రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 87,356

  • ప్రేమెందర్ రెడ్డి (బీజేపీ) : 34,516

  • అశోక్ (స్వతంత్ర అభ్యర్థి) : 27,493


ప్రధానంగా తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డిల మధ్యే పోటీ నెలకొంది. మొత్తం మూడు రౌండ్లు ముగిసే సమయానికి 2,64,216 వలిడ్ ఓట్స్ నమోదయ్యాయి.  నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఇప్పటి వరకు మొత్తం 2,88,000 ఓట్లను లెక్కించారు. ఇంకా 48,013 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఓట్ల లెక్కింపులో భారీగా చెల్లని ఓట్లు బయటపడుతున్నాయి. మూడు రౌండ్లు ముగిసే సరికి చెల్లని ఓట్లు 23,784గా నమోదయ్యాయి. విద్యావంతులే ఇలాంటి పొరపాట్లు చేయడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్​ జరుగుతోంది. పట్టభద్రుల ఉపఎన్నికలో మొత్తం 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి అవుతుంది. చెల్లిన ఓట్లలో 50 శాతానికిపైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు సజావుగా జరిగిందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలకపోతే పూర్తి ఫలితం రావడానికి శుక్రవారం సాయంత్రం పట్టొచ్చు.