Actress Aamani: ఒకప్పుడు హీరోయిన్స్‌గా నటించిన చాలామంది నటీమణులు.. ఇప్పుడు తల్లి పాత్రల్లో తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అలాంటి వారిలో ఆమని ఒకరు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె నటించిన ‘చందమామ కథలు’ అనే మూవీలో నరేశ్‌తో లిప్ లాక్ సీన్ చేశారు ఆమని. దానిపై ఆమె తాజాగా స్పందించారు. అంతే కాకుండా అప్పటిరోజుల్లో హీరోలకు, డైరెక్టర్లకు, ఇప్పుడు ఉన్నవారికి తేడా ఏంటని ఆమె మాటల్లో చెప్పారు. షూటింగ్స్‌లో టెక్నికల్ పరంగా వస్తున్న మార్పుల వల్ల ఆర్టిస్టులు, డైరెక్టర్లు కూడా అజాగ్రత్తగా తయారవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆమని.


జయసుధనే ఫాలో అవుతాను..


‘‘హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా నేను బోల్డ్‌గా చేశాను. ఫస్ట్ మూవీలో నరేశ్‌తోనే చాలా క్లోజ్‌గా నటించాను. అందుకే ‘చందమామ కథలు’ మూవీలో లిప్ కిస్ కూడా నాకేం పెద్దగా తప్పు అనిపించలేదు. ఆర్టిస్ట్‌గా సందర్భం వచ్చినప్పుడు చేస్తానని చెప్పాను.. చేశాను. అన్నీ తెలిసే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇది చేయను, అది చేయను అంటే ఇంట్లో కూర్చోవాల్సిందే. కొంతమంది చేయను అన్నా కూడా వాళ్లకు వర్కవుట్ అవుతుంది. కానీ నేను అలా కాదు. జయసుధ నటించిన చాలా సినిమాలు చూశాను. ఆవిడ గ్లామర్ పాత్రలకంటే నేచురల్ క్యారెక్టర్లే ఎక్కువ చేశారు. సహజనటి అని ఆమెను ఊరికే అనలేదు. అలాంటివి నేను కూడా ఫాలో అవుతాను’’ అని బోల్డ్ పాత్రలు చేయడంపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు ఆమని.


టేక్ తీసుకోవాలంటే భయం..


అప్పట్లో, ఇప్పట్లో సినీ పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో షూటింగ్‌లో రెండో టేక్ తీసుకోవాలంటే భయమేసేది. ఆర్టిస్టులు కూడా ఇంకొక టేక్ తీసుకోకూడదు అని ముందే ప్రిపేర్ అయ్యేవాళ్లు. అజాగ్రత్తగా ఉండేవాళ్లం కాదు. ఏ ఆర్టిస్ట్ అయినా కూడా పెద్ద డైలాగ్ అంటే ముందే రీహార్సెల్ చేసుకొని వీలైనంత టేక్స్ తగ్గించుకొని ఒకే టేక్‌లో చేయాలని అనుకునేవాళ్లు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఎన్ని టేక్స్ తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. డైరెక్టర్లే ఈజీగా ఇంకొక టేక్ అడుగుతున్నారు. ఆర్టిస్టులకు కూడా భయం అనేది పోయింది. మానిటర్ వచ్చిన తర్వాత టేక్ అవ్వగానే వచ్చి మానిటర్‌‌లో చూస్తున్నారు. అప్పట్లో అది లేదు’’ అని గుర్తుచేసుకున్నారు.


కాన్ఫిడెన్స్ ఉండడం లేదు..


‘‘మానిటర్‌లో చూసేవరకు ఆర్టిస్టులకు తెలియడం లేదు బాగా చేశారా లేదా అని. వాళ్లపై వాళ్లకే కాన్ఫిడెన్స్ ఉండడం లేదు. అది తప్పని అనడం లేదు కానీ టెక్నికల్‌గా వచ్చిన మార్పుల వల్ల అలా అయిపోయాం. డైరెక్టర్లు కూడా మానిటర్స్‌లో చూసేవరకు ఆర్టిస్ట్ ఎలా చేశాడని తెలియడం లేదు. ఒకవేళ మానిటర్ పనిచేయకపోతే షూటింగ్ ఆపేసి అది వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. నేను కూడా మానిటర్‌కు అలవాటు అయిపోయాను’’ అని చెప్పుకొచ్చారు ఆమని. ఇక హీరోల్లో తనకు ప్రత్యేకంగా ఫేవరెట్ అని ఎవరూ లేరని, అందరూ బాగా చేస్తారని ప్రశంసించారు. ఇప్పటికీ తాను గ్లిసరిన్ లేకుండానే స్క్రీన్‌పై ఏడ్చేస్తానని బయటపెట్టారు.


Also Read: నన్ను శ్రీదేవితో పోల్చేవారు.. తోటి హీరోయిన్లతో గొడవలు, ఆ హీరో డబుల్ మీనింగ్‌లో మాట్లాడేవాడు: ఆమని