Dornakal Politics :ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ నియోజవర్గం చాలా డిఫరెంట్.. అధికార పార్టీ అయిన ప్రతిపక్షం అయిన నాయకుల మధ్య విభేదాలు కామన్.  నియోజకవర్గ  నాయకుల మధ్య విభేదాలతో  ఇటు క్యాడర్ మొత్తం అయోమయంలో పడినట్లు చర్చ సాగుతోంది.  ఒకరు ఒక మండలంలో మరొకరు రూరల్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమల్లో హడావుడి చేస్తున్నారు. ఈసారి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్  నా కంటే నాకు అంటూ సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు రామచంద్ర నాయక్,  నెహ్రూ నాయక్ లు.


క్యాడర్ లో  తర్జన భర్జన 


చిత్తశుద్ధితో ప్రజా సమస్యలపై ఒక ప్రతి పక్షపార్టీగా కాంగ్రెస్ ఉండకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహపడుతున్నారు. ఆపద వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి డోర్నకల్ నియోజవర్గంలో కనిపిస్తుంది. అధికార  పార్టీ తప్పిదాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన డోర్నకల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  దీంతో  క్యాడర్ ను అయోమయానికి గురవుతున్నారు.  


లోకల్ లీడర్..నాన్ లోకల్ లీడర్ అంటూ సెటైర్లు


ఒకరు లోకల్ లీడర్ పేరుతో ఓ గుంపును వెంటేసుకుని నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో పనిచేస్తుంటే...మరో నాయకుడు నాన్ లోకల్ లో ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వస్తు తన క్యాడర్ ను వెంటేసుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో నెహ్రూ నాయక్,రామచంద్ర నాయక్ మధ్య వర్గ పొరుతో మరోసారి అధికార పార్టీ ఎమ్యెల్యే గెలిచే అవకాశాలు ఉన్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా డోర్నకల్ నియోజకవర్గంలో  వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో వేచి చూడాలి. 


టీ కాంగ్రెస్ లో సంక్షోభం చల్లారినట్లేనా? 


 తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అసంతృప్త నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం గాంధీ భవన్‌కు వచ్చారు. నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన తాను ఇక గాంధీ భవన్ మెట్లెక్కనని సవాల్ చేశారు. ఆ ప్రకారం అప్పటి నుండి గాంధీ  భవన్ కు రావడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా గాంధీ  భవన్ కు రావడమే కాదు..నేరుగా రేవంత్ రెడ్డితో సమావేశం జరిపారు. తమ మధ్య విభేదాలేమీ లేవన్నట్లుగా ఆయన వ్యవహరించడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. గాంధీ భవన్ మెట్లెక్కనని తాను ఎప్పుడూ అనలేదని రేవంత్ రెడ్డి కవర్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావు ధాక్రే నియమితులైన తర్వాత  తొలి సారి హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆహ్వానించారు. కానీ ఆయన తాను గాంధీ భవన్ కు రానని..బయట కలుస్తానని సమాచారం ఇచ్చారు.దానికి తగ్గట్లుగా తర్వాతి రోజు.. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్ రావు ధాక్రేతో సమావేశం అయ్యారు. కానీ రెండో సారి మాణిక్ రావు థాక్రే.. తెలంగాణ పర్యటనకు వచ్చే సరికి ఆయన గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు.