Warangal BRS office has been issued notices for illegal construction :  హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హనుమకొండ బాల సముద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి అనుమతులు లేవంటూ హనుమకొండ జిల్లా బీ అర్ ఎస్ పార్టీ అధ్యక్షులకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కాజీపేట సర్కిల్ నుండి ఈ నోటీసులు జూన్ 25వ తేదీన జారీ అయ్యాయి. నోటీసులు జారీ సమాచారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను మూడు రోజుల్లో అనుమతి పాత్రలు అందజేయాలని లేదంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీస్ లో పేర్కొన్నారు. 


అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు                            


తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించుకుంది. ఆయా కార్యాలయాలకు స్థలాలను కూడా ప్రభుత్వం వద్దనే తీసుకున్నారు. నిర్మాణాలు చేశారు. అయితే వరంగల్ పార్టీ ఆఫీసుకు మాత్రం అనుమతులు లేవని నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాదు పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను సమర్పించాలని అధికారులు ఆదేశించారు. నోటీసుల సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు కేవలం మూడు రోజులు గడువు మాత్రమే ఇచ్చారు. దాదాపుగా వారం పూర్తయింది.ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.  


ఏపీలో వైసీపీ కార్యాలయలకూ నోటీసులు                   


ఏపీలో వైసీపీ కార్యాలయాల అంశం వివాదాస్పదమయింది. వైసీపీ అన్ని జిల్లాల్లోనూ భారీ ప్యాలెస్ ల తరహాలో నిర్మాణాలు చేపట్టింది. ఒక్క జిల్లాలో మినహా మరే జిల్లాలోనూ అనుమతులు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటికే మంగళగరిలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని తెల్లవారుజామున కూల్చేశారు. మిగతా కార్యాలయాలను కూడా కూల్చేస్తారన్న ఆందోళనతో వైసీపీ పార్టీ అత్యవసరంగా కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు  ఈ పిటిషన్లపై విచారణ జరిపి స్టేటస్ కో విధించింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు చెప్పే వరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. 


కోర్టు ప్రకటించే నిర్ణయం ఆధారంగా చర్యలు


ఇప్పుడు కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తందన్నదానిపైనా వైసీపీ ఆఫీసుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అక్రమ కట్టడాలను కాపాడమని ఏ కోర్టు చెప్పదని తీర్పు రాగానే కూల్చివేతలు ఖాయమని టీడీపీ నేతలంటున్నారు. అలాంటి పరిస్థితే తెలంగాణలో బీఆర్ఎస్ ఆఫీసుకు రావడంతో... ఇక్కడ కూడా కూల్చివేతల్లాంటి చర్యలు తీసుకుంటారా అన్న చర్చ ప్రారంభమయింది.