Bandi Sanjay : వరంగల్ లో బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో నిర్వహించింది. ఈ మార్చ్ అనంతరం సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. ఓరుగల్లుగా సాక్షిగా హామీ ఇస్తున్నా.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఖాళీ పోస్టుల భర్తీపై తొలి సంతకం చేస్తామన్నారు. మంత్రివర్గం నుంచి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేదాకా పోరాడతామన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం ఇవ్వాలన్నారు.
తొలి సంతకం ఉద్యోగాల భర్తీపై
‘‘ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా... బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు, ఆయా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నేతలను కాపాడుకునేందుకే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. లీకేజీ కేసులో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాటాన్ని ఆపేది లేదని ప్రకటించారు.
ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్
శనివారం సాయంత్రం ఓరుగల్లులో వేలాది మందితో బీజేపీ నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది. కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన మార్చ్ లో వేలాది మంది నిరుద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికిపాటి మోహన్ రావు, మాజీ ఎంపీలు చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 'ఓరుగల్లు నిజంగా పోరుగల్లే. పోరాటాలకు పుట్టినిల్లే. ఆనాడు భరతమాత సంకెళ్లు తెంచేందుకు సాగించిన క్విట్ ఇండియా, ఖిలాఫత్ ఉద్యమాలకు ఊపిరిలూదిన ఖిల్లా ఇది. నిజాం నవాబును కూల్చేవరకు మడమ తిప్పని పోరును కొనసాగించిన జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూడిన జిల్లా.... నేటి పాలకులు అడుగడుగునా అవమానించినా భరిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే తన సర్వస్వం ధారపోసిన జయశంకర్ సార్ పుట్టిన జిల్లా ఇది. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ దాకా అవతరించిన పార్టీని ఆదరిస్తూ కాషాయ జెండాకు అడుగడుగునా అండగా ఉన్న జిల్లా ఇది. ఇవాళ కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియామక పాలనకు వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తింటోంది ఓరుగల్లు వీరులే' అన్నారు.
30 లక్షల నిరుద్యోగుల జీవితాలు నాశనం
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తనను పోలీసులు అరెస్ట్ చేసిన ఓరుగల్లు గడ్డపైనే నిరుద్యోగ మార్చ్ ప్రారంభించామని బండి సంజయ్ తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసీఆర్ కనీసం స్పందించలేదన్నారు. పైగా విచారణ జరిపించాలని కోరితే ఇదే గడ్డపై తనను అరెస్ట్ చేశారన్నారు. అందుకే ఇక్కడే వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి బీజేపీ సత్తా చాటామన్నారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదు? తప్పు చేశారు కాబట్టే నీ కొడుకును పాడుకోవాలనుకుంటున్నవా? వెంటనే నీ కొడుకును బర్తరఫ్ చేయ్ అంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాలు విరిగిందని కుంటిసాకులు
లిక్కర్ దందా నుంచి తప్పించుకోవడానికి రాజశ్యామల యాగం చేస్తూ కాలు విరిగిందని ఎమ్మెల్సీ కవిత ఈడీకి కుంటిసాకులు చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మీరు అవినీతికి పాల్పడుతుంటే, తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం బీజేపీది కాదన్నారు. ఉద్యోగాల రాక సునీల్ నాయక్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నా ఏనాడూ కేసీఆర్ మాట్లాడలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా ఇంతవరకు స్పందించలేదన్నారు. దేనికోసం తెలంగాణ సాధించుకున్నాం? 2014లోనే 25 వేల ఉద్యోగాలను రద్దు చేశారని, అయినా బిశ్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. రేపు మాపు ఉద్యోగాల భర్తీ అంటూ 9 ఏళ్లుగా టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్న సర్కార్ కేసీఆర్ దే అని విమర్శించారు.
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్
"ఈ నిరుద్యోగ మార్చ్ ఇంతటితో ఆగదు. ఈనెల 21న పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం. ఆ తరువాత అన్ని ఉమ్మడి జిల్లాలన్నింట్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతాం. ఆ తరువాత లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం. ఈ వేదికపై సీఎంకు చెబుతున్నా.. సిట్ విచారణకు మేం ఒప్పుకోం. నయీం, మియాపూర్, డ్రగ్స్ కేసులో సిట్ విచారణ నివేదికలేమైనయ్? కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను కాపాడుకునేందుకే సిట్ విచారణ చేస్తున్నారు. మీ తప్పు లేకపోతే టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా సభ్యులను ఎందుకు తొలగించడంలేదు? వాళ్లను తొలగిస్తే మీ బండారం బయటపడుతుందనే భయంతోనే వెనుకంజ వేస్తున్నారు. కేసీఆర్ కుట్రలను కచ్చితంగా బయటపెడతాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే ఫైలుపై మొట్టమొదటి రోజే సంతకం చేస్తాం. ఎవరు సీఎం అయినా సరే కచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయిస్తాం. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం"- బండి సంజయ్