Hyderabad Ambedkar Statue : హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ విగ్రహం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆ సంస్థ ప్రతినిధులు అందించారు. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం ఆనందంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేడ్కర్ విగ్రహం టూరిజం స్పాట్ గా మారుతుందని మంత్రి తెలిపారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందనలు
సీఎం కేసీఆర్‌కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌కు స్టాలిన్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని బుద్ధ విగ్రహానికి, తెలంగాణ కొత్త సచివాలయానికి మధ్య ఏర్పాటు చేయడం అద్భుతమని స్టాలిన్ కొనయాడారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
అంబేడ్కర్ విగ్రహం ప్రత్యేకతలివే
దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఠీవీగా నిల్చొని ప్రపంచానికి విలువైన సందేశాన్ని ఇవ్వబోతోంది. రోజుకు 425 మంది శ్రామికుల రాత్రి పగల కష్టం, ప్రభుత్వం ప్రణాళిక, మరెంతో మంది మేధస్సే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. విగ్రహం ఎత్తు 125 అడుగులుంటే, 11.34 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది. విగ్రహం కోసం 353 టన్నుల స్టీల్ వాడారు. 112 టన్నుల ఇత్తడిని వినియోగించారు. ట్యాంక్ బండ్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. మొత్తంగా రూ.146.50 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టు 021 జూన్ 3న పురుడు పోసుకుంది. నిర్దేశిత గడువు 2023 ఏప్రిల్ 30 కంటే ముందుగానే పనులు పూర్తి అయ్యాయి.
ఈ ప్రాజెక్టును నొయిడాకు చెందిన సంస్థ డిజైన్ చేసింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ ఈ విగ్రహాలను తీర్చిదిద్దారు. ముందు స్టీల్‌లో విగ్రహాన్ని తయారు చేసి తర్వాత దానిపై ఇత్తడి పూతను పూశారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు మెరిసేలా పాలీయురేతీన్ కోటింగ్ ఇచ్చారు. ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెయిన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ అన్నీ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేశారు.