Honor Killing : వనపర్తి జిల్లాలో పరువు హత్య జరిగింది. సొంత తండ్రే కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన బోయ రాజశేఖర్ తన కూతురు గీత(15)ను కాళ్లు చేతులు కట్టేసి గొడ్డలితో గొంతు కోసి చంపాడు. గీత అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్న తండ్రి రాజశేఖర్ కొద్ది కాలంగా కుటుంబ పరువు తీయకంటూ గీతకు చెప్పి చూశాడు. కానీ గీత ఇవేవీ పట్టించుకోకుండా తిరిగి తన ప్రేమను కొనసాగిస్తుండడంతో కుటుంబ పరువు దిగజార్చుతావా అంటూ గీతను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వనపర్తి జిల్లా డీఎస్పీ ఆనంద్ రెడ్డి తో పాటు పెబ్బేరు ఎస్సై అక్కడికి చేరుకుని పూర్తి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సొంత కూతురిని తండ్రి హత్య చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. 


సిగరేట్ గొడవతో.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న యువకులు 


 కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులకే ఎక్కువ విలువ ఇస్తుంటారు చాలా మంది. ఇంట్లో చెప్పుకోలేని ప్రతీ సమస్యను మిత్రులతో పంచుకుంటారు. ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకోవాల్సిన స్నేహితులు.. పది రూపాయల విలువ చేసే సిగరేట్ కోసం గొడవ పడ్డారు. గొడవ మాత్రమే కాదండోయ్.. చివరికి ఒకరి ప్రాణాలు పోయాయి. అయితే ఈ ఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం గాజులరాజం బస్తీకి చెందిన సందీప్‌ అలియాస్‌ బాబీ(23), అదే ప్రాంతానికి చెందిన జగడం సాయిలు చిన్ననాటి నుంచి మిత్రులు. అయితే ప్రతిరోజూ లాగే ఈరోజు కూడా వీరిద్దరూ కలిసి బస్తీలోని ఆర్కే సూపర్ మార్కెట్ పక్కన ఉన్న గల్లీలో సిగరేట్ తాగారు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. అయితే విచక్షణా జ్ఞానం కోల్పోయిన సాయి.. బాబీపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పిడి గుద్దులు గుద్దాడు. విషయం గుర్తించిన స్థానికులు అక్కడకు వచ్చి వారిని ఆపి వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వీళ్లు మాత్రం ఆగలేదు. జనాలు ఎక్కువయ్యే సరికి వారిద్దరూ కొట్టుకోవడం ఆపారు. అయితే అప్పటికే బాబీకి తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. 


పోలీసుల నిఘా లేదని విమర్శలు.. 
విషయం గుర్తించిన స్థానికులు బాబీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందతూ మృతి చెందాడు. సిగరెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కాలంలో కొత్తగూడెం పట్టణంలో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయి. పోలీసుల నిఘా కరువవడంతో నిర్మాణుష్య ప్రాంతాల పాటు రద్దీ ప్రాంతాల్లో సైతం అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని స్థానికులు అంటున్నారు. దీంతోపాటు గంజాయికి యువకులు ఎక్కువగా అలవాటుపడ్డారని ఈ క్రమంలోనే తరుచూ పట్టణంలో గొడవలు జరుగుతున్నాయని  పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇద్దరి స్నేహితుల మద్య సిగరెట్‌ విషయంలో జరిగిన గొడవ ఒకరి మృతికి కారణం కావడం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో సంచలనంగా మారింది.