KTR Letter To Modi : ‘రోజ్ గార్’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ అరోపించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత జీవితాలతో పరిహాసమాడడం మాని చిత్తశుద్ధితో, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఘాటైన బహిరంగ లేఖను కె.టి.రామారావు రాశారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పిన మోదీ ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారని.. . అంతటితో ఆగకుండా కేవలం 75 వేల మందికి మాత్రమే నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆరోపించారు. కేవలం మీ పరిపాలన వైఫల్యం అడ్డగొలు అర్ధిక విధానాల వలనే దేశ అర్ధిక వ్యవస్ధ నేల చూపులు చూస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కోట్ల ఉద్యోగాలు హమీ ఇచ్చి, కేవలం వేల ఉద్యోగాలతో మీరు చేస్తున్న మీడియా ప్రచారా పటోపం, పదే పదే నిరుద్యోగ యువతతో పరిహాసం అడుతున్నట్లు ఉన్నదన్నారు. ఆర్భాటపు ప్రచార కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతమీద రుద్దే ప్రయత్నం చేయడం దారుణమని.. రోజ్ గార్ మేళా పేరుతో కబేళాలో బలి పశువుల మాదిరి నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలెక్కడ ?
బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనకు 8 ఏండ్ల కాలం దాటింది. మీరు ఇప్పటికే ప్రకటించినట్టు ఏటా 2 కోట్ల ఉద్యోగాల ప్రకారం నేటికే 16 కోట్ల ఉద్యోగాలు నింపాలి. కానీ నేటివరకు మీరు భర్తీ చేసిన ఉద్యోగాలెన్నో స్పష్టం చేయగలరా? దీనిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా ? అని కేటీఆర్ మోదీని ప్రశ్నించారు. మూడున్నర కోట్ల తెలంగాణ జనాభాకు రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లల్లో సూమారు 1 లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసినం, మరో 91 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించినం. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 2,50,000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేస్తున్నపుడు,,130 కోట్ల దేశ జనాభాలో మీరు నింపిన ఉద్యోగాలెన్ని? దాని శాతమెంత ? అని ప్రశఅనించారు.
ఏటా 2 లక్షల మంది రిటైర్ !
దేశంలో ఏటా 2 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా సరిగ్గా భర్తీ చేయడం లేదన్నారు. మీరు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల అమ్మకాల పందేరం వలన సూమారు రెండున్నర లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్ధలో సూమారు 50శాతం ఉన్న రిజర్వుడ్ కేటగిరిలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరకకుండా పోతున్నాయన్నారు. 2014 నంచి 2022 ఎనిమిది ఏండ్లలో జూన్ 2022 నాటికి కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 7లక్షలు మాత్రమే..ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సూమారు 16 లక్షలున్నాయని మీ ప్రభుత్వమే చెప్పింది. ఈ నేపథ్యంలో మీరు రోజ్ గార్ మేళా ద్వారా కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగులను మీరేం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేయాలి !
దేశవ్యాప్తంగా నిరుద్యోగం గతంలో ఎప్పుడు లేనంతగా పెరిగి రికార్డులు నమోదు చేస్తున్నాయని లేఖలో కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికైన ప్రతి ఎన్నికల ముందు ప్రజలను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలి. ఇచ్చిన హమీ మేరకు భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేంటనే చేపట్టాలి. కేవలం మీడియా హెడ్ లైన్లు, పత్రికల్లో ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగ యువతకు అవకాశం ఇచ్చేలా కేంద్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.