Fire accident in pebbair Agriculture Market Godown: పెబ్బేరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. వనపర్తి జిల్లా పెబ్బేరులోని మార్కెట్ యార్డులో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గోన సంచులు, ధాన్యం కాలిపోవడంతో రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఘటనపై మంత్రి తుమ్మల ఆరా
పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 12 లక్షల గన్నీ (గోనె) సంచులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. గోదాంలో గోనె సంచులకు అంటుకున్న మంటలు ధాన్యం బస్తాలకు సైతం అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు పెబ్బేరు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయి. ఈ భారీ అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. మార్కెట్ అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, నష్టం వివరాలపై అధికారులను ఆరా తీశారు. ఈ అగ్ని ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.
పెబ్బేరు మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరగగా.. కొత్తకోట, వనపర్తి, గద్వాల నుంచి ఫైరింజన్లు వచ్చి, మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారికి సంబంధించి సేకరించిన గోనె సంచులు అగ్గికి కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ధాన్యం సైతం కాలిపోయింది. భారీ అగ్ని ప్రమాదం కావడంతో ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందో కూడా ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.