సింగరేణి కార్మికులు సంతోషంలో మునిగిపోయారు. వేజ్‌బోర్డు బకాయిలు అకౌంట్లలో జమ కావడంతో... పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. నిన్ననే 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం జమ చేసింది. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. ఒక్కో కార్మికుడిని ఎరియర్స్ రూపంలో దాదాపు రూ.3.70 లక్షల వరకు క్రెడిట్ అయ్యింది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు రావడంతో... కార్మికులు సంతోషానికి అవదులు లేవు. కార్మికులు, వారి కుటుంబసభ్యులు సంతోషంలో మునిగిపోయారు.
సింగరేణి చరిత్రలో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి అని చెప్పారు సంస్థ ఫైనాన్స్, పర్సనల్ డైరెక్టర్ ఎన్.బలరామ్. ముందు రెండసార్లుగా ఎరియర్స్ చెల్లించాలని భావించామన్నారు. అయితే.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. అందుకే ఒకే విడతలో మొత్తం డబ్బు కార్మికుల అకౌంట్లలో క్రెడిట్ చేశామన్నారు. అంతేకాదు... అనుకున్న సమయం కన్నా ముందే... 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను విడుదల చేశామన్నారు. కోల్ ఇండియాకన్నా ముందే 11వ వేజ్‌బోర్డు సిఫారసులను సింగరేణి సంస్థ అమలు చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. డీబీటీ విధానంలో 39వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.1450 కోట్లను జమచేశామన్నారు సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్. ఇన్‌కమ్ ట్యాక్స్, CMPFలో జమచేయాల్సిన సొమ్మును మినహాయించి... మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
11వ వేజ్‌బోర్డు బకాయిల చెల్లింపేకాదు... సింగరేణి కార్మికులకు మరో గుడ్ కూడా చెప్పింది యాజమాన్యం. దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు సింగరేణి డైరెక్టర్ బలరామ్. దీపావళి బోనస్ పీఎల్‌ఆర్‌ను కూడా ముందే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పెద్ద మొత్తంలో ఇచ్చిన ఈ ఎరియర్స్ సొమ్మును కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని... కుటుంబ భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఇక, ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి 11వ వేజ్‌బోర్డు బకాయిలు జమ అవుతోంది. దీని ప్రకారం 11వ వేజ్‌బోర్డు బకాయిల్లో అత్యధిక మొత్తం పొందిన కార్మికుడిగా.. రామగుండం-1 ఏరియా హెడ్ ఓవర్‌మెన్ వేముల సుదర్శన్‌రెడ్డి నిలిచారు. ఆయన అత్యధికంగా రూ.9.91 లక్షలు అందుకుని అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో రామగుండం-2 ఏరియాకు చెందిన ఈఐపీ ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్ ఉన్నారు. ఈమె రూ. 9.35 లక్షలు అందుకున్నారు. ఇక, రూ.9.16 లక్షలు అందుకుని మూడోస్థానంలో నిలిచారు శ్రీరాంపూర్ ఏరియా హెడ్ ఓవర్‌మెన్ ఆడెపు రాజమల్లు. 11వ వేజ్‌బోర్డు బకాయిలు విడుదల చేసినందుకు... అదికూడా విడతల వారీగా కాకుండా పెద్ద మొత్తం ఒకేసారి చెల్లించినందుకు గాను... సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ ఎన్.బలరామ్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.