Voting in Jubilee Hills byelection: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదు అయింది. ఐరు గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అందుకే ఓటింగ్ శాతం 55 శాతంపైనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి లెక్కలు బుధవారం ఉదయానికి వచ్చే అవకాశం ఉంది.
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగింది. మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు. 407 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ జరిగింది. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో 50 శాతం పోలింగ్ అంటే గొప్పగా జరిగినట్లుగా భావిస్తారు. ఓటర్లు నియోజకవర్గాల నుంచి వలస పోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లేసేందుకు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాలతో పోలింగ్ పర్సంటేజీ తక్కువగా ఉటుంది. 2023లో మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ 45 శాతం నమోదు అయింది. ఈసారి ఐదు గంటలకు అంత కంటే ఎక్కువగా నమోదయింది. పోలింగ్ ప్రారంభంలో నెమ్మదిగా సాగినా, మధ్యాహ్నం నుంచి ఓటర్లు ఎక్కువగా హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు 10.02% , 11 గంటలకు 20.76% , మధ్యాహ్నం 1 గంటకు 31.94% ఓటింగ్ జరిగింది. సాయంత్రం నాలుగు గంటలకు ఇది 48 శాతానికి చేరుకుంది.
పోలింగ్‌కు మొదటిసారిగా 150 డ్రోన్ కెమెరాలతో రియల్‌టైమ్ మానిటరింగ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 900 సీసీటీవీలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండ ఉల్లంఘనలపై మూడు కేసులు నమోదయ్యాయి. మధురనగర్ పోలీస్ స్టేషన్‌లో బీర్ల ఇలయ్యా, రామచంద్రనాయక్, రామ్‌దాస్ మీద ఈ మూడు కేసులు నమోదయ్యాయి. బోరబండ పోలీస్ స్టేషన్‌లో దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ మీద కేసు నమోదు అయింది. పలు చోట్ల డబ్బుల పంపణీ, దొంగ ఓట్లు వంటి వివాదాలు చోటు చేసుకుని చిన్న పాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎమ్‌లు సీల్ చేసి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలిస్తారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.