CBI SIT on TTD Adulterated ghee case: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగంగా నిర్వహిస్తోంది. టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబరు 13 విచారణకు తప్పక హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో, వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఎ.వి. ధర్మారెడ్డి సోమవారం సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడి
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్, ఈ కేసులో భారీ కుట్రలు బయటపడ్డాయని, ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తేల్చింది. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీల ద్వారా 68.17 లక్షల కిలోలకు పైగా పామ్ ఆయిల్, రసాయనాలతో కల్తీ చేసిన నెయ్యి టీటీడీకి సరఫరా చేశారు. దీని మొత్తం విలువ రూ. 250 కోట్లకు పైగా ఉందని సిట్ నివేదికలు సూచిస్తున్నాయి.
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారంపై ప్రధానంగా అనుమానం
వై.వి. సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో, ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యిగా తేలినప్పటికీ, సరఫరా కొనసాగించారని గుర్తించారు. ఎలాంటి చర్యలు తీర్చలేదని సిట్ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటికే సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న, రసాయనాల సరఫరాదారు అజయ్ కుమార్ సుగంధ్‌లను అరెస్టు చేశారు. రూ. 25 ప్రతి కిలో కమిషన్ తీసుకున్నారని సిట్ గుర్తించింది. సుబ్బారెడ్డి బ్యాంక్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ ఆదేశించింది. అయితే సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు లేవని.. మరో వైరం రోజుల గడువుకోరుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు.
విచారణకు హాజరైన మాజీ ఈవో ధర్మారెడ్డి
మరోవైపు, మాజీ ఈవో ధర్మారెడ్డి సోమవారం తిరుపతిలోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. వైసీపీ హయాంలో ఈవోగా ఉన్న సమయంలో భారీ మొత్తంలో కల్తీ నెయ్యి లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ప్రశ్నించారు. ధర్మారెడ్డి పదవీకాలంలోని టెండర్లు, సరఫరాలు, నివేదికలపై లోతుగా విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం మారిన తర్వాత ఆయన బయట కనిపించడం ఇదే మొదటి సారి.