Vikram Goud Resigned to Telangana BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో (Telangana) బీజేపీకి (BJP) షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ (Vikram Goud) తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కు ఓ లేఖ సైతం రాశారు. 'పార్టీలో కొత్తగా చేరిన వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. పెద్ద నాయకులు క్రమశిక్షణకు మారు పేరు అంటూ కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా కష్టపడినా ఫలితం లేకపోతోంది. ప్రజాబలం లేని వారికి పెద్ద పీట వేస్తున్నారు. అలాంటి వారి కింద పని చేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అందుకే ఆవేదనతో బీజేపీకి రాజీనామా చేస్తున్నా.' అంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇదే కారణమా.?
విక్రమ్ గౌడ్.. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నేతగా ముఖేష్ గౌడ్ పేరొందారు. బలమైన సామాజిక వర్గంలో తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన విక్రమ్ గౌడ్.. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ పెద్దలు ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోషామహల్ సీటును విక్రమ్ గౌడ్ ఆశించారు. అయితే, ఎమ్మెల్యే రాజాసింగ్ పై అప్పటివరకూ ఉన్న బహిష్కరణ వేటును ఎత్తేసిన పార్టీ అధిష్టానం ఆ సీటును రాజాసింగ్ కు ఇచ్చింది. అప్పటి నుంచి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అటు, లోక్ సభ ఎన్నికల్లోనైనా అధిష్టానం తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తుందని భావించినప్పటికీ.. ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.