SSC Paper Leak : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారులకు షాక్ తగిలింది. పరీక్ష ప్రారంభమై ఏడు నిమిషాలకే పేపర్ లీక్ అయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలుగు పేపర్ లీకైనట్టు అధికారులు గుర్తించారు. ఉదయం 9.37 నిమిషాలకు పేపర్ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభమైంది. ఇంతలోనే పేపర్ లీక్ కావడంతో అంతా అవాక్కయ్యారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే లీక్ ఎలా అయిందనే అనుమానం అందరిలో వ్యక్తమైంది. లీక్‌పై ఆరా తీస్తే ఓ టీచర్ దీన్ని లీక్ చేసినట్టు తేల్చారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఆయన్ని తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి పోలీసులు విచారిస్తున్నారు. అసలు కారకులు ఎవరు దేని కోసం ఇలా లీక్ చేశారనే కోణంలో విచారణ సాగుతోంది.
పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే
ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ వికారాబాద్ జిల్లా తాండూర్ వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపులలో
ముందే చక్కర్లు కొట్టింది. ఉదయం 9:37కే వాట్సాప్ గ్రూప్ లలో పేపర్ ప్రత్యక్షమైంది. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చినా పేపర్ మనది కాదని బుకాయించారు. మరోవైపు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 12 గంటల 30 నిమిషాలకు బయటకు వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ చూడగా ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే విధంగా ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ముందుగానే పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని వెలుగులోకి వచ్చింది. లీక్ చేసింది బంద్యప్ప అనే ప్రభుత్వ సైన్స్ టీచర్ అని తెలిసింది.
తాండూర్ లో పేపర్ లీక్
తాండూర్ మండల కేంద్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. మొదట పేపర్ లీక్ కాలేదని విద్యాశాఖ అధికారుల చెప్పుకొచ్చారు. అనంతరం పేపర్ లీకైనట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఎంఈవో వెంకటయ్య ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట వాట్సాప్ లో ప్రశ్నాపత్రం ఉంచిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాండూర్ ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్లో పేపర్ లీకేజీ అయినట్లు పోలీసులు గుర్తించారు. పాఠశాలకు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఫోన్ నుంచి వాట్సాప్‌లో షేర్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఉపాధ్యాయుడు బంద్యప్ప పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యాశాఖ అధికారులు చెప్పినా పేపర్ లీకేజీ వార్తలను పోలీసులు నిర్ధారించారు.
పేపర్ ఎక్కడా లీక్ కాలేదు
పది పేపర్ బయటికి పంపిన ఘటనపై కేసు నమోదు చేస్తామని వికారాబాద్ అడిషనల్ ఎస్పీ మురళి తెలిపారు. పేపర్ ఎక్కడ లీక్ కాలేదని, స్కూల్ లో ఉన్న సైన్స్ టీచర్ బంద్యప్ప 10వ తరగతి పేపర్ ను వాట్సాప్ ద్వారా ఒక మీడియా గ్రూప్ లో షేర్ చేశాడన్నారు. 9.37కు పేపర్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడన్నారు. అప్పటికే విద్యార్థుల అందరు పరీక్ష హాల్ లో ఉన్నారని తెలిపారు. గ్రూప్ లో ఉన్న వారు ఆ మెసేజ్ ను 11 గంటలకు చూశారని తెలిపారు. ఎగ్జామ్ హాల్ లో నుంచి పేపర్ ని పంపినందుకు ఇన్విజిలేటర్ పై కేసు నమోదు చేస్తామన్నారు.