వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాడ్లాపూర్‌ అనే గ్రామంలో శిరీష అనే యువతి అనుమానాస్పద మృతి చెంది ఉండడంపై పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. హతురాలి సెల్ ఫోన్ డేటాను సేకరించి వివరాలను రాబడుతున్నారు. ఇప్పటికే కాడ్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 


యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించినా కూడా పోలీసులు యువతి చనిపోవడానికి కారణాలను తేల్చలేకపోయారు. సోమవారం (జూన్ 12) ఉదయం శిరీష ఇంటికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్‌ వైష్ణవి నేతృత్వంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్‌ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు శిరీష తండ్రిపైన అనుమానంతో అతనిపై కూడా దాడి చేశారు. శిరీషను హత్య చేసిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయని, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. శిరీష అంత్యక్రియల తర్వాత ఆమె తండ్రి జంగయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కాల్ డేటా ఆధారంగా శిరీష మృతి చెందిన మరుసటిరోజు యువతి ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి గొడవ జరిగినప్పుడు శిరీష వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నానని పోలీసుల విచారణలో బావ అనిల్ చెప్పాడు. ఉదయం ఫోన్ నుంచి కాల్ వెళ్ళినప్పటికీ తనకు ఫోన్ పాస్ వర్డ్ తెలియదంటూ అనిల్ చెప్పాడని పోలీసులు తెలిపారు. డాటా డిలీట్ కాకుండా సీడీఆర్ ద్వారా కాల్ హిస్టరీ సేకరించే ప్రయత్నం చేశారు. ఆ కాల్ డేటా బయటికి వస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.


వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష.. శనివారం (జూన్ 10) రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపు అవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ లు చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం రోజు ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో శిరీష శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే శిరీష మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ముందుగా హత్య చేసి ఆ తర్వాతే మృతదేహాన్ని కుంటలో పడేసినట్లు పోలీసులు చెబుతున్నారు. శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. అయితే ఈమెను ఎవరు, ఎప్పుడు, ఎలా చంపారో త్వరలోనే తేలుస్తామని పోలీసులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.