Bandi Sanjay On KCR : రాష్ట్రంలో బీఆర్ఎస్ ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేనివాళ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచిన కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల అప్పు చేసి ప్రజల చేతికి చిప్ప ఇస్తారని మండిపడ్డారు. పంచాయతీలకు నిధులివ్వకుండా, ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరితేనే ప్రజా ప్రతినిధులకు నిధులిస్తామని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ తరతమ బేధం లేకుండా తెలంగాణలోని పంచాయతీలన్నింటికీ నిధులు కేటాయిస్తున్నారన్నారు. బీజేపీలోనే చేరితేనే నిధులిస్తామని మోదీ ఆఫర్ ఇస్తే బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. 


దిల్లీ దోస్త్ కొండ పోచమ్మ సాగర్ పర్యటన  


‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా  వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేటలో జరిగిన సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.  ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ... "కేసీఆర్ ఇయాళ జల్దీ లేచిండట. వాళ్ల దోస్త్ పంజాబ్ సీఎం వచ్చిండు. ఆయనను కొండ పోచమ్మ సాగర్ పంపి చాలా బాగుందని అనిపించారు. కొండ పోచమ్మ సాగర్ కోసం ఎంతోమంది త్యాగం చేసి జాగాలిచ్చారు. ఆ పక్కనే మల్లన్న సాగర్ లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదని రైతులు ధర్నాలు చేశారు. ఒక రైతు అయితే ఆయన చితి ఆయనే పేర్చుకుని ఆహుతైపోయారు. అయినా సిగ్గు లేదు." అన్నారు. 


వారణాసిలో ఫ్లెక్సీలు పెట్టి పరువు పోగొట్టుకున్నారు 


తెలంగాణలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పెడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించడంతోపాటు భరోసా కల్పించడమే స్ట్రీట్ కార్నర్ మీటింగుల ఉద్దేశమన్నారు. ఇప్పటిదాకా 1900 స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించామన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అన్న బండి సంజయ్... అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు, బంధువులు మాత్రమే పదవుల్లో ఉండాలని చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో కొత్త నాయకుల్ని ఎదగనీయరన్నారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ ను వణికించే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ధర్నా చౌక్ కు, అక్కడి ఊర్లలోకి గుంజకొచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. బీఆర్ఎస్ లోకి వచ్చే వాళ్లంతా చెల్లని కాసులే అని విమర్శించారు. దోచుకున్న పైసలన్నీ పంచి పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. వారణాసిలో మోదీని ఓడిస్తామని ఇలానే ఫ్లెక్సీలు పెట్టి పరువు పోగొట్టుకున్నారన్నాు. మూతపడే టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ అనే కొత్త దుకాణం పెట్టి దేశమ్మీద పడ్డారని ఎద్దేవా చేశారు. 


బీఆర్ఎస్ అంటే అవినీతి, రజకార్ల, కుటుంబ పార్టీ 


"రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, రజకార్ల, కుటుంబ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను దించాలంటే బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీ చేస్తున్న పోరాటాలను చూసి ఆదరిస్తున్నందునే ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రజలే ముఖ్యమని, అన్ని రాష్ట్రాలు సమానమనే భావనతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులిస్తోంది.   తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కట్టివ్వలే. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎవరికైనా ఇచ్చారా? . రైతులకు రుణమాఫీ చేయడం లేదు. 25 వేల కోట్లు రుణమాఫీ అవసరమైతే 6 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కేసీఆర్ మాటలు నమ్మి రుణాలు కట్టకపోతే బ్యాంకోళ్లు రైతులకు కొత్త రుణాలియ్యడం లేదు. సొంత సొమ్మును జమ చేసుకుంటున్నారు. ఫ్రీ యూరియా ఇస్తానని మాట తప్పారు. 8 ఏళ్లలో అకాల వానలతో పంట నష్టపోయిన రైతులకు నయా పైసా పరిహారం ఇయ్యని దుర్మార్గుడు కేసీఆర్. కేంద్రం ఫసల్ బీమా యోజనతో రైతులకు ఆదుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేయకుండా రైతులను మోసం చేస్తున్నారు."- బండి సంజయ్