Telangana BJP :  తెలంగాణ బీజేపీ కీలక నేత  విజయశాంతి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. కనీసం మాట్లాడలేదు. లఆమెను ఎవరూ పట్టించుకోలేదన్న ఆగ్రహంతో వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. కానీ విజయశాంతి తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసిన వారు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయానని.. అలాంటి వేదికపై ఉండలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. నేరుగా పేరు చెప్పలేదు కానీ.. ఆమె మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


కిషన్ రెడ్డి ప్రమాణంలో కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక గౌరవం


ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. ఆయన అదే హోదాలో కిషన్ రెడ్డి ప్రమాణానికి వచ్చారు. మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు అంటున్నారని తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని అన్నారు. కారు తాళాలు మనం తీసుకోవాలన్నారు. కారు స్టీరింగ్ తమ దగ్గర ఉందని పతంగి పార్టీ వాళ్లు అంటుంటారు.. తాళాలు తీసుకుంటే కారు ముందుకు వెళ్లదు అని వ్యాఖ్యానించారు. కిరణ్ రెడ్డి ప్రసంగం చాలా మంది  బీజేపీ నేతలకు అసౌకర్యంగానే అనిపించింది. 


తేనే తుట్టెను కదిపిన విజయశాంతి


తెలంగాణ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి కి పాజిటివ్ ఇమేజ్ లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోనంటూ ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తూంటారు. ఇక ఆయన పక్కా సమైక్యవాది. జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో చీకట్లలో మగ్గిపోతుందని వ్యాఖ్యలు చేశారు. అందుకే..బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే విజయశాంతి నేరుగానే తన అసంతృప్తిని బయట పెట్టడం ద్వారా.. కారణం కోసం చూసుకుంటున్న చాలా మంది బీజేపీ నేతలకు దారి చూపించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


బీఆర్ఎస్ కు అస్త్రం దొరికినట్లేనా ?


విజయశాంతి తాను కార్యక్రమంలో పాల్గొనలేకపోవడానికి కారణం కిరణ్ కుమార్ రెడ్డేనని చెప్పకనే చెప్పారు. అయితే ఆ కిరణ్ కుమార్ రెడ్డిని జాతయ నాయకత్వం ప్రత్యేకంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంది. జాతీయ కార్యవర్గ  భేటీలో చోటు కల్పించింది. అలాంటి నేతను వ్యతిరేకించడం అంటే..  హైకమాండ్ ను ధిక్కరించినట్లే. విజయశాంతి వ్యూహాత్మకంగా  చేశారా లేకపోతే.. అనుకోకుండా చేశారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ బీజేపీపై ఇతర పార్టీలు ఎటాక్ చేయడానికి ఓ అవకాశంలాగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.