Vijayasanthi  On Bandi :   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేత విజయశాంతి ప్రకటించారు. ఆయనను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని తరుణ్ చుగ్  కూడా చెప్పారని విజయశాంతి గుర్తు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. 


 





 


అయితే  విజయశాంతి ఇలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి తొలగింపు ప్రచారంపై స్పందించడం బీజేపీలో రకరకాల చర్చలకు కారణం అవుతోంది. నాయకత్వ మార్పు అనేది అంతర్గత అంశం. బీజేపీలో ఇలాంటివి పైకి మాట్లాడితే క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తారు.  అయినా రాములమ్మ స్పందించాల్సి వచ్చింది. దీనికి కారణం.. ఇటీవల ఆమె రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ను ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారం కావడమేనని విజయశాంతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  ఇటీవల టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓ సందర్భంలో ఆయన తాను పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ప్రకటించారు. 


రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  ములమ్మ స్పందించారు. కానీ కాంగ్రెస్ అంతర్గత విషయాలపై ఆమె ఎందుకు స్పందిస్తారని.. ఆమె తెలంగాణ పార్టీ అంశాలపైనే స్పందించారని..  ఆమె చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ కు ముడి పెట్టి కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో రాములమ్మ ఉలిక్కి పడి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  తాను బండి సంజయ్‌కు వ్యతిరేకం కాదని తన సోషల్ మీడయా పోస్టు ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది. ఇటీవల తెలంగాణ బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని విజయ శాంతి కూడా ఫీలవుతున్నారు. దానికి కారణం  బండి సంజయేనన్న అసంతృప్తి ఆమెకు ఉందంటున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. 


తల్లి తెలంగాణ పేరుతో రాజకీయ  పార్టీ పెట్టినప్పటికీ తర్వాత టీఆర్ఎస్‌లో  విలీనం చేశారు. ఆ పార్టీ తరపున  ఎంపీగా గెలిచారు.  కానీ తెలంగాణ ప్రకటించడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ... ఇమడలేక బయటకు వచ్చేశారు. బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఆమెకు  ప్రత్యేకంగా ఎలాంటి  పదవి ఇవ్వలేదు. బీజేపీ నేతగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాల్సి వస్తుందో కూడా పార్టీ హైకమాండ్ ఆమెకు సూచనలివ్వలేదు. ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం లేకపోవడంతో.. సమస్య అవుతోంది. గతంలో పోటీ చేసిన మెదక్‌లో ఓడిపోయిన తర్వతా పర్యటించలేదు. దీంతో విజయశాంతి పోటీపైనా సందిగ్ధత ఏర్పడింది.