Vijaya Shanthi: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని గతంలోనే ఎంఐఎం చెప్పిందని.. కానీ ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఒక్కసారి కూడా స్పందించలేదని అన్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లూ వాళ్ల చేతిలోనే స్టీరింగ్ ఉందన్న ఎంఐఎం.. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ తమ చేతుల్లో లేదని చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల అంతర్గత వ్యవహారం అని.. ఈ మూడు పార్టీలు అవిభక్త కవలలు అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ మూడు పార్టీలు ఎన్నికలకు ముందు లేదా తర్వాత పొత్తు పెట్టుకోవడమో, కూటమిగా మారడమో చేస్తుందని.. కానీ ఈ విషయం వారికి తప్ప ప్రజలెవరికీ తెలియదని ట్విట్టర్ వేధికగా వివరించారు. 






బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒక్కటే..!


నిజంగా బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలోనే ఉంటే దేవాలయాలకు కోట్ల రూపాయల కేటాయింపులు ఎలా జరుగుతాయని ఒవైసీ అన్న మాటలను అంతా గమనించాలని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతి భవన్ గేటు దాటలేరు కానీ అసదుద్దిన్ మాత్రం బైక్ పై నేరుగా ప్రగతి భవన్ లోపలికి వెళ్లగల్గుతారంటూ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఏ విధమైన అవగాహనం ఉందో ఈ ఘటన చూస్తేనే తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంఫైర్ గా ఎంఐఎం, టీఆర్ఎస్ షాడో బాక్సింగ్ చేస్తుందని అన్నారు. 










ఇటీవలే బీఆర్ఎస్ పై తనదైన స్టైల్ లో విమర్శలు


భారతీయ రాష్ట్ర సమితి - బీఆర్ఎస్ పేరు చెబితే మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని.. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ఒక చిన్న రైతు సంఘం ఎన్నికలకు కూడా కోట్ల రూపాయలు పంచి అదే స్థాయిలో ముందెన్నడూ అక్కడ లేని విధంగా ఇతర రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చేయ్యాల్సిన దుర్మార్గ పరిస్థితిని తీసుకువచ్చారని మండిపడ్డారు. మున్ముందు దేశం అంతటా ఇదే రకం వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ పేరుతో తీసుకువస్తారని అన్నారు. తెలంగాణలో దోపిడీ చేసిన లక్షల కోట్ల అవినీతి ధనం అండతో దేశంలోని అన్ని పార్టీల ఎన్నికలకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేసీఆర్ వెళ్తున్న విధానం, మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేస్తుందని అన్నారు. ఇది నియంతృత్వ ప్యూడల్ ధోరణికి దారి తీస్తున్న పరిస్థితి కావొచ్చేమోనని ట్వీట్ లో పేర్కొన్నారు.