Vemulawada Dharma Gundam: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇన్నాళ్లూ మూసి ఉన్న ధర్మగుండాన్ని ఎట్టకేలకు తెరిచారు. గత మూడు సంవత్సరాలుగా మూసి ఉన్న వేములవాడరాజన్న ఆలయ ధర్మగుండం ఈ రోజు నుండి భక్తులకు పుణ్య స్నానాలకు నోచుకుంది. ఉదయం 8 గంటలకు ఆలయ వేద పండితులు ప్రత్యేకంగా ధర్మగుండం పున ప్రారంభ పూజ నిర్వహించి, పుణ్యవచనము చేసి మొదటగా ధర్మగుండం నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేసి భక్తులకు అనుమతించారు. కరోనా తాకిడితో మూడు సంవత్సరాల క్రితం మూసిన ధర్మగుండం భక్తుల, అధ్యాత్మక వ్యక్తుల కోరిక మేరకు దేవాదాయ, ధర్మదాయా శాఖ వారు స్పందించి ఎట్టకేలకు ఈ రోజు నుండీ భక్తులకు పుణ్య స్నానాల మోక్షం కలగించారు. గత 15 రోజులుగా ఆలయ సిబ్బంది ధర్మగుండాన్ని శుద్ధి చేసి, కలర్లు వేసి, నిండుగా నీళ్లు నింపి భక్తులకు పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులకు పవిత్ర పుణ్య స్నానాల మోక్షం కలిగినట్లైంది. ఈ శైవక్షేత్రంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలన్నీ మాయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము.
ఇదీ చరిత్ర
వేములవాడ ధర్మ గుండానికి చరిత్ర కూడా ఉంది. అలనాడు హరిహర మహారాజు అనే వ్యక్తి శాప గ్రస్తుడై కుష్టు రోగంతో అడవి, గుట్టలు తిరుగుతూ అప్పటి వేములవాడ అనే పిలువబడే ఇప్పటి ఈ వేములవాడకు చేరుకున్నాడు. గుడి ముందున్న చెట్టు కింద కూర్చొని బాధ పడుతుంగా.. అక్కడికి అనారోగ్యంతో వచ్చిన కొన్ని జంతువులు అందులో స్నానం ఆచరించి ఆరోగ్యంగా వెళ్లడం ఆ రాజును ఆశ్చర్యపరిచిందట. వెంటనే హరిహరి మహారాజు ఇదేదో మాయ కొనేరు అనుకుని... తాను కూడా ఈ ధర్మగుండంలో మూడు సార్లు మునిగి లేలాడట. వచ్చేసరికి శాపంతో ఉన్న కుష్టిరోగం మాయమైంది అని పురాణాలు చెపితున్నాయి. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా పిలుస్తున్నారు. ఆనాటి నుండి ఈ ధర్మగుండంలో స్నానాలు చేస్తే పాపాలతో పాటు దీర్ఘకాలిక రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.
దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్నిఅభివృద్ది చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేములవాడ అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం కేసీఆర్ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి వద్దకు వెళ్లనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు వేములవాడ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆగమ సంబంధమైన సమస్యలు, ఆలయ సంబంధమైన ఇబ్బందులు లేకుండా పునర్నిర్మాణ బాధ్యత మొత్తాన్నీ శృంగేరీ జగద్గురువులకే అప్పగిస్తారనీ ప్రచారం జరుగుతోంది. పండితులు, శిల్పులంతా వారు సూచించిన మేరకే ఉంటారని అంటున్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు వైష్ణవ గురువు అయిన చినజీయర్ సహాలు ఎక్కువగా తీసుకున్నారు. అందుకే ఈ సారి శైవం వైపు దృష్టి సారించారని భావిస్తున్నారు. వైష్ణవంతో పాటు శైవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.