VC Sajjanar : TSRTC సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కామెడీ చేసేవారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు VC సజ్జనార్. కామెడీ పేరుతో విధులకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు చేసిన ఓ ప్రాంక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సజ్జనార్. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కామెడీ పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని సహించేది లేదంటూ పోస్ట్ పెట్టారు. సజ్జనార్ పెట్టిన పోస్టులో ఏముందంటే...
ఇదేం వెర్రి కామెడీ.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా .. మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న RTC ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా? పిచ్చి కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఉపేక్షించదు అని హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలను విడిచిపెట్టేది లేదు.. పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోస్ట్ లో రాసుకొచ్చారు. ఓ బస్ కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు
సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే.. RTC బస్ మూవ్ అయ్యేందుకు రెడీగా ఉంది. హడావుడిగా ప్రయాణికులు బస్సెక్కుతున్నారు. ఆ సమయంలో ఎవరికి వారే ఈ బస్ అక్కడకు వెళుతుందా, ఇక్కడకు వెళుతుందా అంటూ వరుస ప్రశ్నలు ఎదుర్కొంటారు కండక్టర్లు. ఎందరు అడిగినా ఓపిగ్గా సమాధానం చెబుతారు. ఇలాంటి టైమ్ లో ఓ యువకుడు కండక్టర్ దగ్గరకు వెళ్లి ఈ బస్ గుంటూరు వెళుతుందా అని అడిగాడు. ఇది హైదరాబాద్ బస్ అని కండక్టర్ చెప్పగానే... కాలికి వేసుకున్న చెప్పు తీసి చెవి దగ్గర పెట్టుకుని పోన్ లా మాట్లాడుతూ...అరె ఈ బస్ గుంటూరు పోదంట ఇది అని మాట్లాడుకుంటూ వెనుతిరిగాడు. ఈ వీడియో పోస్ట్ చేశారు సజ్జనార్...
సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలన్న పిచ్చితో నేటి యువత చాలామంది కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు. తమ సరదా తీరిపోతోందని ఆలోచిస్తున్నారు కానీ ఎంత వెగటు కామెడీ చేస్తున్నారన్నది ఆలోచించడం లేదు. అదే సమయంలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాం అనే విచక్షణ కూడా ఉండడం లేదు. తనవిధుల్లో తాను బిజీగా ఉన్న కండక్టర్ తో యువకుడు ప్రాంక్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం అందరకీ అర్థమవుతుంది. మీకు పనిలేదని విధినిర్వహణలో ఉన్నవారిని డిస్ట్రబ్ చేస్తారా బాధ్యత ఉండక్కర్లేదా? అందుకే ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ చేసిన సజ్జనార్ తన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు.
కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు వెళ్లేవారికోసం TSRTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది...ఆ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి