Uttam Kumar Reddy About KCR:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా ఇవ్వడం తప్పు అని కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. గ్రామ పంచాయతీలు బలపడాలని నేరుగా నిధులు ఇవ్వడం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. అంటే పంచాయతీలకు కేంద్రం నిధులు ఇవ్వడం అనేది గత 30 సంవత్సరాలుగా అమలులో ఉందని గుర్తుచేశారు.


సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గ్రామ సర్పంచ్ లకు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి కానీ, కేసీఆర్ వాటికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. లోకల్ బాడీస్ కి మరిన్ని నిధులు ఇవ్వాలని, అప్పుడే గ్రామాలు మరింత ముందుకు వెళ్తాయని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. పంచాయతీలకు వచ్చే నిధులు పెంచాలని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాలకు ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ లకు నిధుల కేటాయింపు ఏది. తెలంగాణలో కేసీఆర్ వల్ల సర్పంచ్ ల పరిస్థితి దయనీయంగా మారిందని, బిల్లులు రాకపోవడం వల్ల ఆత్మహత్యలు శరణ్యంగా మారిందని ఆరోపించారు.


ఈ ఏడాది 20 లక్షల మెట్రిక్ టన్నులు
పోయిన సంవత్సరం యాసంగికి 92 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరగగా.. ఈ సంవత్సరం నిన్నటి వరకు కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగినట్లు అఫీషియల్ గా తెలిపారు. గత ఏడాదితో పోల్చితే 25 శాతం మేర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నా.. వారిపై నమ్మకం లేక, అత్యవసర పరిస్థితుల్లో రైతులు రూ.1400 కే అమ్ముకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


వారికి నగదు ఇవ్వకపోవడం దురదృష్టకరం
అభయ హస్తం పథకం కింద 22 లక్షల మంది మహిళా సంఘ సభ్యుల సొంత డబ్బులు 1070 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వారి అమౌంట్ వారికి ఇవ్వకపోవడం దురదృష్టకరం. అన్నారు. 3700 కోట్ల రూపాయలు 69 లక్షల మంది మహిళ సంఘం సభ్యులకు వడ్డీలేని రుణం కింద బకాయి ఉందని, ఇవన్నీ మహిళలకు అందే వరకు వారి పక్షాన కాంగ్రెస్ పోరాడతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


Also Read: Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్