Uttam Kumar Reddy : తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు తనపై కాంగ్రెస్ లో కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ బహిరంగలేఖ రాశారు. కాంగ్రెస్ లోని ఓ ముఖ్య నేత తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండేళ్లుగా తననే టార్గెట్ చేసుకుని ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నది ఇంటి దొంగలేనని బహిరంగలేఖలో పేర్కొన్నారు. పార్టీలో తాను కొన్ని పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు కానీ..జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చూపించడానికి అవసరమైన విది విధానాలను తాను పాటిస్తానని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. తనపై రెండేళ్ల నుంచి పార్టీ మార్పు ప్రచారం జరుపుతూ.. పార్టీలో తన అనుచరుల్ని ఎదగనీయకుండా.. అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
రెండు రోజులకిందట.. ఎమ్మెల్సీ , సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందన్నట్లుగా మాట్లాడారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఇవి ఇంకా ఊపందుకున్నాయి. తెంలగాణలో ప్రస్తుతం టిక్కెట్ల కసరత్తు అంతర్గతంగా జరుగుతోంది. ఒక కుటుంబానికి ఒక్క టిక్కెట్ అన్న విధానాన్ని పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా వర్తిస్తుందని సంకేతాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి.. ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు.
గత ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి ఓడిపోయారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినప్పటికీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నుంచిపోటీ చేసి విజయం సాధించారు. దాంతో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో ఆయన భార్య పద్మావతినే నిలబెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.బీఆర్ఎస్ విజయం సాధించింది. తర్వాత టీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్నుంచి ఆయన పార్టీ మార్పుపై ప్రచారం ఊపందుకుంది.
ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం అంతా తెలంగాణ కాంగ్రెస్ నేతలే చేస్తున్నారని ఆయన అప్పట్నుంచి దూకుడుగా ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల తీవ్రతను రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు .
గలేనని బహిరంగలేఖలో పేర్కొన్నారు.